Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం... జగన్ ని షర్మిళ అంత మాట అనేశారేంటి?

అవును... ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   8 April 2024 9:27 AM GMT
ఫస్ట్  టైం... జగన్  ని షర్మిళ అంత మాట అనేశారేంటి?
X

ఎన్నికల వేళ ఏపీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటివరకూ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు బలంగా నడిచిన నేపథ్యంలో... తాజాగా వైఎస్ షర్మిళ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా వైఎస్ వివేకా కేసు పేరు చెప్పి కడపలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ను గతంలో ఎవరూ అనని మాట అనడం గమనార్హం!

అవును... ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ కనిపించని దృశ్యాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిళ... ఇప్పుడు అదే జగన్ పై నిప్పులు కురిపిస్తున్నారు. తాజాగా ప్రారంభించిన బస్సుయాత్రలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ.. కుంభకర్ణుడిలా నాలుగున్నరేళ్లు జగన్ నిద్రపోయారంటూ వ్యాఖ్యానించారు!

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా కడప జిల్లా కమలాపురంలో బస్సు యాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిళ.. తన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు కుంభకర్ణుడిలా నిద్రపోయి, ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్రలేచారని విమర్శించారు.

ఏపీలో ఎటు చూసినా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు మాత్రమే ఉన్నాయని.. అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. ఇదే క్రమంలో... తన తండ్రి వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని చెప్పిన షర్మిళ... జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులకు దిక్కే లేదని, కడప స్టీల్ ఫ్యాక్టరీని గాలికి వదిలేశారని ఫైరయ్యారు! కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయ్యి ఉంటే.. ప్రత్యక్షంగా పాతిక వేల మందికి, పరోక్షంగా మరో 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు.

అనంతరం వైఎస్ వివేకా వ్యవహారంపై స్పందించిన షర్మిళ... వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా హత్య చేసిన వారు బయట తిరగుతున్నారని మండిపడ్డారు. అవినాశ్ రెడ్డిని నిందితుడని సీబీఐ చెప్పినప్పటికీ మళ్లీ అతడికే జగన్ టికెట్ ఇచ్చారని విమర్శించారు! స్వయంగా సీఎం జగన్ కి బాబాయ్ అయినా కూడా వివేకా విషయంలో కనీస న్యాయం జరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఇదే సమయంలో... నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే తాను పోటీలో నిలుచున్నట్లు పునరుద్ఘాటించారు.