ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి షర్మిల 'అడుగులు'
దీనికిగాను షర్మిలకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అవార్డు ప్రదానం చేశారు.
By: Tupaki Desk | 15 Aug 2023 11:26 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు పేరుగాంచిన కుటుంబం ఏదంటే మరో మాట లేకుండా వచ్చే సమాధానం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తండ్రి వైఎస్ఆర్, అన్న వైఎస్ జగన్ బాటలోనే నడుస్తూ వైఎస్ షర్మిల తన ప్రత్యేకత చాటుకున్నారు. తండ్రి, అన్న ఒక్కసారే పాదయాత్ర చేస్తే.. షర్మిల మాత్రం రెండుసార్లు పాదయాత్ర సాగించడం విశేషం. అందులోనూ ప్రత్యేకత ఏమంటే.. ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో, మరోసారి ప్రత్యేక తెలంగాణలో షర్మిల పాదయాత్ర సాగించారు. అసలు ఓ మహిళ పాదయాత్ర చేయడమే అరుదంటే ఆమె రెండుసార్లు ఆ ఘనతను అందుకున్నారు.
తండ్రిని మించిన తనయ.. అన్నకు అధిగమించిన చెల్లె
2003లో నడి వేసవిలో ఏకంగా ప్రజాప్రస్థానం పేరిట 1,475 కిలోమీటర్లు నడిచారు వైఎస్. ఏ సోషల్ మీడియా లేని రోజుల్లో అదో సంచలనం. వడదెబ్బ సహా ఎన్నో కష్టాలెదురైనా ఆయన చెక్కుచెదరకుండా యాత్ర సాగించారు. ఇక 2017 నవంబరులో ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 341 రోజులు పాదయాత్ర చేశారు వైఎస్ జగన్. మొత్తం 3,648 కిలోమీటర్లు నడిచిన ఆయన 2 కోట్ల మంది ప్రజలతో మమేకం అయ్యారు. తండ్రీ కొడుకులిద్దరూ అలా సీఎంలు అయ్యారు. కాగా, 2011-12లో అన్నకు మద్దతుగా షర్మిల ఉమ్మడి ఏపీలో పాదయాత్ర సాగించారు. ఇక ఏపీ విడిపోయాక.. అన్న సీఎం కూడా అయ్యాక ఆమె ప్రత్యేక తెలంగాణలో కాలుపెట్టారు. ఇక్కడా రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్టీపీని స్థాపించారు.
పాదయాత్రికురాలు..
2021లో పార్టీని స్థాపించిన షర్మిల కొద్దిరోజుల్లోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అలా తెలంగాణలో 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ రికార్డు సాధించిన తొలి మహిళగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. తండ్రి తరహాలోనే ప్రజాప్రస్థానం పేరుతో 2021 అక్టోబరు 20న చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. వివాదాస్పద, వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో చర్యలు తీసుకుంది. అయినా న్యాయపోరాటం చేసి అనుమతి తెచ్చుకున్నారు. దీనికిగాను షర్మిలకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అవార్డు ప్రదానం చేశారు.
మరి ఆ అడుగులు కాంగ్రెస్ వైపేనా..?
ఓ మహిళా ఈ స్థాయిలో పాదయాత్ర చేసి జనంలోకి వెళ్లిన షర్మిల అడుగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు పడుతుండడం గమనార్హం. వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్న ప్రచారం ఇటీవలి విస్తృతంగా సాగుతోంది. అలాంటి సమయంలోనే షర్మిల పాదయాత్రకు అవార్డు దక్కడం ఆసక్తికర పరిణామం.