Begin typing your search above and press return to search.

కర్ణుడి చావు గుర్తిచేసిన షర్మిల.. బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా చంద్రబాబు, మోడీ ప్రస్థావన ప్రముఖంగా ప్రస్థావిస్తూ ఆసక్తికరంగా స్పందించారు.

By:  Tupaki Desk   |   30 Jun 2024 6:46 AM GMT
కర్ణుడి చావు గుర్తిచేసిన షర్మిల..  బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు!
X

2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంత జిల్లాలో ఘోర పరాజయం అనంతరం సైలంట్ అయిన షర్మిళ... ఇటీవల కాస్త యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద స్పందించారు. ఈ మేరకు పోలవరం నిర్మాణంపై ఆమె ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మోడీ ప్రస్థావన ప్రముఖంగా ప్రస్థావిస్తూ ఆసక్తికరంగా స్పందించారు.

అవును.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పై స్పందించారు. ఇటీవల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్ట్ నాశనమైందంటు చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. పోలవరం ఒకప్పుడు చంద్రబాబు ఏటీఎం అనే విషయం మోడీ చెప్పలేదా అని విపక్షం విరుచుకుపడుతుంది.

దీంతో... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పోలవరం ప్రాజెక్ట్ అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. పైగా ఒకప్పుడు జాతీయ ప్రాజెక్ట్ హోదాలో ఉన్న పోలవరం బాధ్యతను చంద్రబాబు తీసుకోవడం.. ఇప్పుడు తిరిగి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలే కొలువుదీరడంతో ఇప్పుడు ఈ అంశం మరింత చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిళ.. ఆసక్తికరంగా స్పందించారు.

ఇందులో భాగంగా... కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా.. పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ, టీడీపి, వైసీపీ పార్టీలే అని మొదలుపెట్టారు షర్మిళ. అనంతరం... ఈ ప్రాజెక్ట్ కట్టి 28 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయమైతే.. పంతాలు పట్టింపులకు పోయి జీవనాడిపై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్ప మరోటి కాదని తెలిపారు.

ఇదే సమయంలో... రాష్ట్ర విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ఇస్తే... మోడీ సర్కార్ ఆ భాధ్యత 10 ఏళ్లపాటు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపించిందని షర్మిళ ఫైర్ అయ్యారు. అదేవిధంగా... కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను తానే కడతానని చెప్పి "పోలవరం - సోమవారం" అంటూ హడావిడి తప్ప బాబు మొదటి 5 ఏళ్లలో చేసింది శూన్యం అని దుయ్యబట్టారు. అనంతరం జగన్ వైపు స్టీరింగ్ మార్చారు.

ఈ క్రమంలో... "రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్ప.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! 10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు" అని షర్మిళ తెలిపారు. అనంతరం.. "ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే మరో 5 ఏళ్లు పడుతుందని చెప్తున్న చంద్రబాబు గారు... మోడీ పిలక మీ చేతుల్లోనే ఉంది" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిళ.

ఇందులో భాగంగా... కేంద్రాన్ని శాసించే అధికారం ఇప్పుడు చంద్రబాబు వద్ద ఉంది కాబట్టి.. పూర్తిస్థాయి నిధులు తెచ్చి, రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా.. పోలవరం పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందంటూ షర్మిళ ఆన్ లైన్ వేదికగా స్పందించారు.