Begin typing your search above and press return to search.

"సత్యం గెలుస్తుంది"... వైఎస్ షర్మిళ సంచలన పోస్ట్!

అవును... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Feb 2024 9:50 AM GMT
సత్యం గెలుస్తుంది... వైఎస్ షర్మిళ సంచలన పోస్ట్!
X

వెంటాడటం మొదలుపెడితే తనకంటే బాగా ఎవరూ వెంటాడలేరు అన్నట్లుగా సాగుతుంది వైఎస్ షర్మిళ రాజకీయం అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతుంది. ప్రధానంగా మొన్నటివరకూ తెలంగాణ రాజకీయాలపై మాత్రమే ఫోకస్ పెట్టిన షర్మిళ... బీఆరెస్స్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టేవారు! సబ్జెక్ట్ ఏదైనా, సందర్భం మరేదైనా... బీఆరెస్స్ నేతలపై ఒంటికాలపై లేచి పడేవారు. ఈ క్రమంలో తాజాగా కాలేశ్వర్ ప్రాజెక్ట్ పై కాగ్ నివేదిక తెరపైకి రావడంతో ఆసక్తికరమైన పొస్ట్ పెట్టారు.

అవును... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై గట్టిగా పోరాడగా.. అప్పుడు వైఎస్సార్టీపీ అధినేతగా వైఎస్ షర్మిళ గట్టిపోరాటమే చేశారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ.. అందుకు సంబంధించిన ఆధారాలను "కాగ్" అధికారులకు అందించారు వైఎస్ షర్మిళ. ఇదే సమయంలో కేసీఆర్ తో పాటూ ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ను దక్కించుకున్న "మేఘా" సంస్థను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అయితే తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ "కాగ్" నివేదిక తెరమీదకొచ్చింది. ఇందులో భాగంగా ఆ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు పెనుభారంగా మారిందంటూ పేర్కొంది! ఈ క్రమంలో... 2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మొత్తం రూ.96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఈ క్రమంలో... 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్లు తీసుకుందని పేర్కొంది.

ఇదే సమయంలో ప్రస్తుతం ఉన్న అసలు అప్పు, వడ్డి, వడ్డీలకు వడ్డి అంటూ లెక్కేస్తే.. కాళేశ్వరం అప్పు 2036వ సంవత్సరంలో పూర్తవుతుందని కాగ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిపై కాగ్ ఇచ్చిన నివేదికలపై అసెంబ్లీలో కూడా సెగలు వచ్చాయి! సరిగ్గా ఈ సమయంలో షర్మిళ ఆన్ లైన్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... కాలేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఆధారాలను తాను 2022 లోనే కాగ్ కు సమర్పించినట్లు వెళ్లడించారు.

ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ లో స్పందించిన షర్మిళ... "సత్యం గెలుస్తుంది" అంటూ... కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గతంలో గట్టిగా పోరాడి నేడు నిరూపిస్తున్నామని.. ప్రజాధనాన్ని గుంజుకున్న ఏ ప్రజా ప్రతినిధి తప్పించుకోలేడని చెబుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో... అక్టోబర్ 21 - 2022న అధికారి జి.సి ముర్ముకు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలను తాను సమర్పించినట్లు షర్మిళ ఫోటోను షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.