షర్మిల జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో...!?
ఇపుడు అదే కాంగ్రెస్ కి ఆమె పీసీసీ చీఫ్. కాల మహిమ ఇది. రాజకీయాల్లో ఇదంతా కొత్త కాదు. అయితే షర్మిల అన్ని పార్టీల నాయకుల మాదిరి కాదు. ఆమె తండ్రి వైఎస్సార్. అలాగే అన్న జగన్ ప్రస్తుతం సీఎం.
By: Tupaki Desk | 21 Jan 2024 3:49 AM GMTఇల్లు అలకగానే పండుగ కాదు, అలాగే పార్టీలు మార్చి పదవులు అందుకున్నంత సులువు కాదు జనాల మెప్పు పొందడం. ఇది సోషల్ మీడియా యుగం. ప్రతీదీ రికార్డు అవుతోంది. గతంలో అయితే ప్రింట్ మీడియా ఉండేది. ఎవరు ఏమి మాట్లాడిన పాత పేపర్లలో అలా కాలగర్భంలో కలసిపోయేది. ఎపుడైతే ఎలక్ట్రానిక్ మీడియా రంగ ప్రవేశం చేసిందో అన్నీ రికార్డు అవుతున్నాయి.
దాంతో తాను అలా అనలేదు అని ఏ నేతా చెప్పలేరు. ఇపుడు వైఎస్ షర్మిల కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఆమె వైసీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ ని పట్టుకుని కడిగేశారు, నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ని భూస్తాపితం చేయాలని కూడా అన్నారు. తమ కుటుంబాన్ని కాంగ్రెస్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని ఆమె దుమ్మెత్తిపోశారు
తన తండ్రి కాంగ్రెస్ కి ఎంతో సేవ చేస్తే అదే కాంగ్రెస్ తమను ఎంతలా హింసించాలో అంతలా హింసించిందని కూడా ఆమె ఏపీ ప్రజలకు చెప్పుకుని మరీ కాంగ్రెస్ పరువు నిలువునా తీశారు. ఇపుడు అదే కాంగ్రెస్ కి ఆమె పీసీసీ చీఫ్. కాల మహిమ ఇది. రాజకీయాల్లో ఇదంతా కొత్త కాదు. అయితే షర్మిల అన్ని పార్టీల నాయకుల మాదిరి కాదు. ఆమె తండ్రి వైఎస్సార్. అలాగే అన్న జగన్ ప్రస్తుతం సీఎం.
దాంతో పాటు ఆమె కూడా కాంగ్రెస్ ని దారుణంగా వ్యతిరేకించారు. ఇపుడు ఆమె ఏపీ ప్రజలకు వీటి మీద జవాబులు అయితే చెప్పాలి. ఆమెకు ఇపుడు కాంగ్రెస్ నచ్చింది. మరి జనాలకు కూడా నచ్చాలి కదా అలా ఎందుకు నచ్చాలో ఆమె చెప్పి ఒప్పించగలగాలి.
కాంగ్రెస్ పార్టీ మంచిదే అయితే జగన్ ఎందుకు వేరే పార్టీ పెట్టుకున్నారు. ఆయన మీద కాంగ్రెస్ పెట్టిన సీబీఐ కేసులు కక్షతో అవునా కాదా. కాదు అనుకుంటే జగన్ అవినీతి చేసినట్లుగా షర్మిల బాహాటంగా చెప్పగలరా. ఇక ఆమె తండ్రి దివంగతులు అయిన తరువాత ఆయన పేరుని సీబీఐ ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పాత్ర ఎంత, ఆమె ఎలా వెనకేసుకుని వస్తారు ఇవన్నీ ప్రశ్నలే.
అలాగే కాంగ్రెస్ ఏపీని అడ్డగోలుగా విభజించిందా లేదా. వైఎస్సార్ వాదం సమైక్య వాదం అవునా కాదా. తన తండ్రి ఆశయాలు తీర్చేందుకే తాను కాంగ్రెస్ లో చేరాను అని చెబుతున్న షర్మిల తండి ఉమ్మడి ఏపీని కోరుకున్నారు. మరి రెండుగా విభజించిన కాంగ్రెస్ లో ఆమె తండ్రి కల ఎలా తీరుతుందని అనుకుంటున్నారు వీటికి కూడా జవాబు చెప్పాల్సి ఉంది.
కాంగ్రెస్ సిధ్దాంతాల కోసం ఆఖరు వరకూ నిలబడతాను అని షర్మిల అంటున్నారు. ఆమె ఇదే మాటను తెలంగాణాలో కూడా చెప్పారు. మరి తెలంగాణాలో తన పార్టీని చాప చుట్టేసి ఏపీకి సులువుగా వచ్చేశారు. మరి అక్కడ తన జీవితం తెలంగాణాకు అంకితం అన్న మాటలను ఎలా మరచిపోయారో ఏపీ విషయంలోనూ అంతేనా అంటే జవాబు ఉంటుందా.
ఇక ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయం మీద కూడా షర్మిల ఎలా జవాబు చెబుతారు అన్నది కూడా అంతా చూస్తున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకపోవడం పోలవరం ప్రాజెక్ట్ ని రెండు టెర్ములు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయకుండా ఎన్నికల హామీ 2014లో పెట్టడం వంటి వాటికి ఆమె జవాబు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇంతకీ ఏపీలో కాంగ్రెస్ ని ఎందుకు ఎన్నుకోవాలో కూడా షర్మిల చెప్పాల్సి ఉంటుంది. ఏపీకి రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చినందుకా అప్పుల కుప్పగా ఏపీ మారడానికి అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ కారణం అయినందుకా ఎందుకు ఎన్నుకోవాలి అంటే షర్మిల జవాబు ఏంటి అన్నది చూడాలి.
ఇక 2014 నుంచి 2024 మధ్యలో దేశంలో లౌకిక వాదానికి ముప్పు ఏర్పడినట్లుగా షర్మిలకు తోచలేదా ఇపుడు ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినందువల్లనే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి అంటే జవాబు ఏమి చెబుతారు అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి షర్మిల ఈ జవాబులు అన్నీ చెప్పి జనాలను ఒప్పించినపుడే ఆమెకూ కాంగ్రెస్ కి ఎంతో కొంత ఆదరణ ఉంటుందని అంటున్నారు.