Begin typing your search above and press return to search.

ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో షర్మిల భేటీ.. అందుకేనా?

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వివిధ పార్టీల నేతలను షర్మిల కలిశారు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 8:22 AM GMT
ఢిల్లీలో వివిధ పార్టీల నేతలతో షర్మిల భేటీ.. అందుకేనా?
X

ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల తన దూకుడును పెంచారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావడం లేదని ఢిల్లీ వేదికగా ఆమె సమర శంఖం పూరించారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఒక రోజు దీక్షకు ఆమె సిద్ధమవుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వివిధ పార్టీల నేతలను షర్మిల కలిశారు.

ఈ క్రమంలో ఢిల్లీలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ ను వైఎస్‌ షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌ లో లేవనెత్తాలని కోరుతూ ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు.. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జేడీ శీలం, తులసిరెడ్డి, మస్తాన్‌ వలీ, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు.

కాగా.. షర్మిల తమ పోరాటానికి డీఎంకేను సైతం మద్దతు కోరారు. దీనిపై స్పందించిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ.. సీఎం స్టాలిన్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని షర్మిలకు తెలిపారు. స్టాలిన్‌ రాగానే చర్చించి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలనూ కేంద్రం సమానంగా చూడాలని కోరారు. సవతి తల్లి ప్రేమ చూపించడం సరికాదన్నారు. రాజ్యసభలో ఏపీ హక్కుల కోసం కాంగ్రెస్‌ చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తిరుచ్చి శివ హామీ ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీల నేతలను కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తామని షర్మిల వెల్లడించారు. చట్టాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని మోదీ చెప్పినా కూడా ఇప్పటికీ ప్రత్యేకహోదా ఇవ్వలేదన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే కాకుండా ఇతర హామీలను కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.

రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్‌ ప్లాంట్‌ వంటి హామీలు అమలుకు నోచుకోలేదని షర్మిల గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. హామీలు అమలు చేయనప్పుడు బీజేపీకి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతునిస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. పదేళ్లవుతున్నా కూడా కీలకమైన పది హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని ధ్వజమెత్తారు. తమ పోరాటం ఇకముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.