బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ!
తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశానని తెలిపారు. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు.
By: Tupaki Desk | 13 Jan 2024 6:32 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు.
తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశానని తెలిపారు. వివాహానికి వస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ప్రస్తావన వచ్చిందన్నారు. వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారని తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ కు స్వీట్లు పంపానని షర్మిల గుర్తు చేసుకున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావుకు కూడా స్వీట్లు పంపానని తెలిపారు.
కాగా జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డికి, ఇడ్లీస్ హోటళ్ల అధినేత మనుమరాలు అట్లూరి ప్రియకు నిశ్చితార్థం జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న వారిద్దరికీ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షర్మిల మొదటి శుభలేఖను తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అలాగే తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులను ఇప్పటికే వైఎస్ షర్మిల ఆహ్వానించారు. మరోవైపు షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం వివిధ నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల వైఎస్ జగన్.. చంద్రబాబు కుటుంబాలను చీలుస్తున్నారంటూ కాకినాడ సభలో మండిపడ్డ సంగతి తెలిసిందే.
వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.