షర్మిల...కాంగ్రెస్...ఆళ్ళ...వర్కౌట్ అయ్యేది ఉందా...!?
ఆయన వైఎస్ షర్మిల తో కలసి కాంగ్రెస్ లో చేరి ఏపీలో మళ్లీ తన కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 15 Dec 2023 3:49 AM GMTఏపీలో ఎన్నికల రాజకీయం నడుస్తోంది. ఎవరు దగ్గినా తుమ్మినా కూడా అందులో నుంచి రాజకీయ లక్షణాలను చూస్తున్న తంతు సాగుతోంది. వైసీపీ తన పార్టీ పరంగా చేయాల్సిన కసరత్తు చేసుకుంటోంది. ఏ పార్టీకి అయినా ఎన్నికల వేళలో ఇవన్నీ మామూలే. సర్వ సాధారణమే అని ఆ పార్టీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి వారు అంటున్నారు.
ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తన పదవీకాలం ఇంకా నాలుగైదు నెలలు ఉండగానే రాజీనామా చేసేశారు. ఆయనకు రాజకీయం అవసరం లేదా అంటే ఎందుకు కాదూ అంటున్న సెక్షన్ ఒక వైపు ఉంది.
అలా కాదు ఆయన మళ్లీ వైసీపీతోనే ఉంటారు అని అంటున్న వారూ ఉన్నారు.
అయితే మరో ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తోంది. దానికీ కాంగ్రెస్ కి షర్మిలకు కట్టేసి మరీ కొత్త పొలిటికల్ మసాలా వండుతున్న వారూ ఉన్నారు. అదెలా అంటే వైఎస్ షర్మిల ఏపీ వైపు చూస్తారని కాంగ్రెస్ పగ్గాలు నెత్తికెత్తుకుంటారని. అలాగే వైసీపీలో టికెట్ దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు.
దీని మీద ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సిట్టింగులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. దేశంలో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడంతో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఇదే గిడుగు రుద్రరాజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఏపీలో ప్రచారం చేసి పెడుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం కలిగిన వారు అని అంటున్నారు. ఆయన వైఎస్ షర్మిల తో కలసి కాంగ్రెస్ లో చేరి ఏపీలో మళ్లీ తన కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు.
మరి ఇవన్నీ జరుగుతాయా వర్కౌట్ అవుతాయా అన్నది చూడాలి. ఈ రోజుకు చూస్తే వైఎస్సార్టీపీ ప్రెసిడెంట్ గానే షర్మిల ఉన్నారు. ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదు. ఆమె కాంగ్రెస్ మనిషి అయితే కానే కాదు. ఇక ఆమె రేపటి రోజున తన రాజకీయాన్ని తెలంగాణాలో చేస్తారా ఏపీలో చేస్తారా అన్నది నిర్ణయం అయితేనే ఆమె కాంగ్రెస్ లో చేరే చాన్స్ ఉంటుంది.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీ మీద పూర్తి ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీని వాడుకోవాలంటే షర్మిలను మించిన ఆప్షన్ లేదు. తెలంగాణాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఒక ఆయుధంగా దొరికారు. అలాగే కాంగ్రెస్ లేచి కూర్చుంది. ఏపీలో కూడా కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలంటే బలమైన నాయకులు అవసరం అంటున్నారు.
దాంతో కాంగ్రెస్ అయితే షర్మిల పార్టీని విలీనం చేసుకుని ఆమెని ఏపీలో కాంగ్రెస్ కోసం పంపాలనే చూస్తోంది అని అంటున్నారు. మరి షర్మిల ఏపీలో కాంగ్రెస్ లో చేరితే జగన్ కి ప్రత్యర్ధి అవుతారు. మరి అన్నా చెల్లెళ్ళం మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. అది ఒక ప్రచారంలో ఉంది. మరి ఆ స్థాయిలో రాజకీయంగా బాహాటంగా ఎదురు నిలిచి పోరాడేటంతా ఉన్నాయా అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా ఒక్క విషయం మాత్రం నిజం. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. వర్కౌట్ అయ్యేది ఉందా ఉంటే ఎంతమేరకు అన్నది చూడాల్సి ఉంది.