షర్మిల కొత్త వ్యూహం.. కడప ఎంపీ బరిలో చిన్నమ్మ!
కడప ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 2 Feb 2024 7:59 AM GMTఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలై ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్న కడప లోక్ సభా నియోజకవర్గం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కడప ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.
వాస్తవానికి... కడప ఎంపీ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని టాక్ నడిచింది. 1989 నుంచి కడప లోక్ సభా నియోజకవర్గంలో వైఎస్సార్ కుటుంబ సభ్యులే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు.
1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో వైఎస్సార్ తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీగా విజయం సాధించారు.
ఇక 2009 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో 2012లోæ వైఎస్ జగన్ వైసీపీ తరఫున కడప ఎంపీగా గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చిన్నాన్న కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.
అయితే వైఎస్ వివేకా హత్య తదనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఇది చాలదన్నట్టు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ఈ పరిణామాలు వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల.. కడప ఎంపీ స్థానం నుంచి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను పోటీ చేయించే యోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి షర్మిల పోటీ చేయాలని అనుకున్నా తనకంటే కూడా తన చిన్నమ్మే.. వైఎస్ అవినాష్ రెడ్డిపై మంచి అభ్యర్థి అవుతారని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి కడప ఎంపీ స్థానం నుంచి వివేకా కుమార్తె డాక్టర్ సునీత పోటీ చేయొచ్చని వార్తలు వచ్చాయి. ఈ మేరకు సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని టాక్ నడిచింది. అయితే ఇటీవల షర్మిల ఇడుపులపాయ పర్యటనలో ఆమెను కలిసిన సునీత కాంగ్రెస్ లో చేరికకు ఆసక్తి చూపలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కడప లోక్ సభా స్థానంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి పైన తన చిన్నమ్మను పోటీ చేయించే యోచనలో షర్మిల ఉన్నారని టాక్ నడుస్తోంది.
అయితే కడప ఎంపీ స్థానం నుంచి సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరితే వైసీపీ దాన్ని రాజకీయంగా వాడుకుని విమర్శలు చేసే అవకాశం ఉందని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ గా సౌభాగ్యమ్మ పోటీ చేస్తే హత్య చేయబడ్డ వివేకాపైన సానుభూతితో కాంగ్రెస్, టీడీపీ ఆమెకు మద్దతు ఇస్తాయని అంటున్నారు. వివేకానందరెడ్డి పైన ఉన్న గౌరవంతో తాము ఆమెకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్, టీడీపీ ప్రకటించొచ్చని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సౌభాగ్యమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని టాక్ నడుస్తోంది.