Begin typing your search above and press return to search.

షర్మిల.. వైసీపీ ట్రాప్‌ లో పడకుండా!

ఇటీవల కాకినాడ సభలో చంద్రబాబు తన రాజకీయాల కోసం కుటుంబాలను కూడా విడగొడతారని వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 3:15 AM GMT
షర్మిల.. వైసీపీ ట్రాప్‌ లో పడకుండా!
X

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తె వైఎస్‌ షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆమె తన ప్రసంగాల్లో వైసీపీతోపాటు టీ డీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. తద్వారా తనను చంద్రబాబు మనిషిగా చిత్రీకరిస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారని చెబుతున్నారు.

ఇటీవల కాకినాడ సభలో చంద్రబాబు తన రాజకీయాల కోసం కుటుంబాలను కూడా విడగొడతారని వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా తన చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌ లో చేరడం వెనుక ఉంది చంద్రబాబేనని ఆయన పరోక్షంగా మండిపడ్డారు.

మరోవైపు ఇప్పటికే వైసీపీ నేతలు షర్మిలపై మాటల దాడి మొదలుపెట్టారు. షర్మిల చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికే ప్రయత్నిస్తోందని తాజాగా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయడానికే షర్మిల పనిచేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ప్రత్యేక విమానాలు పెడుతోంది కూడా చంద్రబాబు మనుషులేనని ఇటీవల వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. షర్మిలను కాంగ్రెస్‌ లో వెనుక ఉండి చేర్చింది చంద్రబాబేనని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో షర్మిల వైసీపీ ట్రాప్‌ లో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె కేవలం వైసీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే ఆమె చంద్రబాబు మనిషేనని వైసీపీ చేసే ఆరోపణలకు బలం చేకూరేది. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాన్ని గుర్తించిన షర్మిల అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన తొలి ప్రసంగంలోనే ఇందుకు తగ్గట్టు నడుచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ పాలనతోపాటు గత టీడీపీ ప్రభుత్వ పాలనను షర్మిల లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ పరిపాలన విధానాలను తూర్పారబట్టారు. చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్‌ చూపిస్తే.. వైఎస్‌ జగన్‌ మూడు రాజధానులంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడని షర్మిల మండిపడ్డారు.

అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశాయని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. తమ స్వప్రయోజనాల కోసం బీజేపీతో ఈ రెండు పార్టీలు అంటకాగుతున్నాయన్నారు. తద్వారా కాంగ్రెస్‌ పార్టీ.. అటు వైసీపీకి, ఇటు టీడీపీకి సమాన దూరంలో ఉంటుందని తన తొలి ప్రసంగంలోనే షర్మిల తేల్చిచెప్పేశారు.

టీడీపీని విమర్శించకుండా కేవలం వైసీపీనే షర్మిల లక్ష్యంగా చేసుకుని ఉంటే పవన్‌ కళ్యాణ్‌ పైన వచ్చినట్టే విమర్శలు వచ్చేవని అంటున్నారు. వాటి నే ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి వచ్చేదని చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం కేవలం వైసీపీ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. టీడీపీ ప్రభుత్వ పాలనపై ఆయన ఎలాంటి విమర్శలు చేయడం లేదని.. చంద్రబాబు ఆయనకు ప్యాకేజీ ఇవ్వడమే ఇందుకు కారణమని వైసీపీ చాలా బలంగా ఆరోపించింది. ఈ ఆరోపణలను కొంతవరకు జనం నమ్మారు కూడా.

ఇప్పుడు షర్మిలను కూడా చంద్రబాబు మనిషే ఆరోపించడం ద్వారా ఆమె క్రెడిబిలిటీకి దెబ్బకొట్టాలని వైసీపీ భావించిందని అంటున్నారు. అయితే అందుకు షర్మిల ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండింటినీ సమానంగా లక్ష్యంగా చేసుకోవడంతో తమ వ్యూహం పారలేదని వైసీపీ వర్గాలు ఢీలా పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.