Begin typing your search above and press return to search.

సీఎంగా రేవంత్ వద్దు.. ఆ ఇద్దరే కరెక్టు అంటున్న షర్మిల

By:  Tupaki Desk   |   3 Dec 2023 3:45 AM GMT
సీఎంగా రేవంత్ వద్దు.. ఆ ఇద్దరే కరెక్టు అంటున్న షర్మిల
X

తెలంగాణలో వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన సీట్లను సొంతం చేసుకుంటుదన్న మాట బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఫైనల్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రిని ఫైనల్ చేసేది మాత్రం కాంగ్రెస్ అధినాయకత్వమే అన్నది తెలిసిందే. వారి మనసులో ఎవరున్నారన్న దానిపై బోలెడన్ని మాటలు బయటకు వచ్చాయి. ఒక వర్గం వాదన ప్రకారం.. ఇప్పటికే రేవంత్ కు సీఎంహామీని పార్టీ అధినాయకత్వం ఇచ్చేసిందని చెబుతున్నారు.

అయితే.. దీనికి ముందు.. పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలి. అప్పుడు మాత్రమే.. సీఎం ఎవరన్న దానిపై చర్చ జరిగే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం పదవికి బ్లాక్ మొయిలర్ లాంటి వాళ్ళు సరికాదని తేల్చేశారు అది కూడా ఆమె ఎక్కడా రేవంత్ పేరు పెట్టకుండా చెప్పారు . బ్లాక్ మొయిలర్ అని.. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఉన్నారన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు.

షర్మిల లెక్కల ప్రకారం ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క.. ఉత్తమ్ కుమార్ రెడ్డిల్లో ఎవరైనా ఓకే అన్న అభిప్రాయం వ్యక్తం కావటం ఆసక్తికరంగా మారింది. తన అభిప్రాయాన్ని కుండ బద్ధలు కొట్టినట్లుగా చెప్పే అలవాటున్న షర్మిల.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ గెలిస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న దానిపై తన అభిప్రాయాన్ని చెప్పటంతో పాటు.. బై.. బై కేసీఆర్ అంటూ సూట్ కేసును ప్రగతిభవన్ కు పంపుతున్నట్లుగా తెలియజేశారు. తమ పార్టీ పోటీ చేస్తే.. ఓట్లు చీలి గులాబీ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న మాటను చెప్పిన షర్మిల.. ఎన్నికల రేసు నుంచి బయటకు వెళ్లిపోవటం తెలిసిందే. అలాంటి ఆమె.. తాజాగా రేవంత్ ముఖ్యమంత్రిని చేయకూడదని చెబుతున్నారు. ఇప్పుడామె మాటలు కొత్త చర్చగా మారాయి.