Begin typing your search above and press return to search.

వైసీపీ విలీనం...షర్మిల వేసిన బాంబు !

పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని నేపధ్యం ఉంది. అటువంటి వైసీపీని నిర్వీర్యం చేయాలని ఒక వైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి చూస్తోంది

By:  Tupaki Desk   |   14 Aug 2024 3:19 PM GMT
వైసీపీ విలీనం...షర్మిల వేసిన బాంబు !
X

ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తే రాజకీయంగా అగమ్యగోచరంగా ఉందని అంటారు. వైసీపీ ఘోర పరాజయం తరువాత సరైన దిశను చూసుకోవడంలోనే విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని నేపధ్యం ఉంది. అటువంటి వైసీపీని నిర్వీర్యం చేయాలని ఒక వైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి చూస్తోంది.

అధికారంలో ఉండడం కూటమి పార్టీలకు అడ్వాంటేజ్. వైసీపీని తొలి రోజులలోనే అణచివేస్తే రానున్న కాలంలో తమకు ఎలాంటి పోటీ ఉండదన్నవి కూటమి స్ట్రాటజీ. అది వారి వరకూ ఓకే. ఇక వైసీపీకి మరో శత్రువు విపక్షంలోనే ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఏపీ చీఫ్ గా ఉన్న షర్మిల చూపు కూడా వైసీపీ మీదనే ఉంది.

ఆమె అధికార కూటమి కంటే కూడా ఎక్కువగా వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీతోనే ఉంది. వైసీపీని లేకుండా చేస్తేనే ఏపీలో కాంగ్రెస్ నిలబడేది. దాంతో వైఎస్సార్ వారసురాలిగా షర్మిలకు రాజకీయంగా అవకాశాలు లభించేది. దాంతో ఎన్నికల ముందు మాత్రమే కాదు, ఎన్నికల తరువాత కూడా షర్మిల వైసీపీ మీదనే తన అస్త్రాలను ఎక్కు పెడుతున్నారు.

తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ కీలక సమావేశంలో పాల్గొని ఏపీకి వచ్చిన షర్మిల ప్రెస్ మీట్ లో యధాప్రకారం వైసీపీ మీదనే తన విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ కలలో కూడా తలవని మాటను ఆమె వాడి ఒక పెద్ద బాంబు పేల్చారు. ఏపీలో వైసీపీ పని అయిపోయింది అని జోస్యం కూడా చెప్పారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామంటే తప్పకుండా స్వాగతిస్తామని ఆమె చెప్పడం అంటే వైసీపీకి ఆమె మరణ శాసనం రాసినట్లే అని అంటున్నారు.

ఒకనాడు వైసీపీ ద్వారా రాజకీయాలకు పరిచయం అయిన షర్మిల ఇపుడు అదే పార్టీ ఏపీలో లేకుండా చేయాలని చూస్తున్నారు. సొంత అన్న పెట్టిన పార్టీ, తండ్రి పేరుతో ఉన్న పార్టీని ఏపీలో కనుమరుగు చేయడానికి ఆమె తన శక్తియుక్తులను మొత్తం వెచ్చిస్తున్నారు అని అంటున్నారు. ఆమె వైసీపీ మీద ఏ స్థాయిలో విమర్శలు చేశారు అంటే జగన్ ఇక ఎప్పటికీ ఏపీకి సీఎం కాలేరని కూడా కఠినమైన జోస్యం చెప్పారు.

అంటే జగన్ కి ఒకే ఒక్క చాన్స్ ఏపీ ప్రజలు ఇచ్చారని టీడీపీ అంటున్న తీరులోనే ఆమె కూడా అంచనా కడుతున్నారన్న మాట. ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదని ఆమె విశ్లేషిస్తున్నారు. అంతే కాదు వైసీపీకి ఇక విజయాలు ఏ విధంగానూ దక్కవని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఉప ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కబోతోంది.

దాని మీద కూడా ఆమె సెటైర్లు పేల్చారు. ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని ఆమె ఎద్దేవా చేశారు. ఇక వైసీపీని ఆమె ఒక పిల్ల కాలువతో పోల్చారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అని ఒక వైపు ప్రచారం సాగుతున్న వేళ షర్మిల దానిని తాము స్వాగతిస్తున్నామని చెప్పరు పిల్ల కాలువలు అన్నీ సముద్రంలో కలిసి తీరాల్సిందే అని ఆమె అన్నరు. వారు కాంగ్రెస్ తో కలుస్తామంటే తప్పకుండా స్వాగతిస్తామని అన్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ చీఫ్ జగన్ తో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్న విషయాలను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలు అని ఆమె అంటున్నారు మొత్తనికి చూస్తే షర్మిల మళ్లీ వైసీపీ మీద స్ట్రాంగ్ గానే కౌంటర్లు వేశారు. మరి దీనికి వైసీపీ నుంచి ఏ రకమైన రియాక్షన్ వస్తుంది అన్నది చూడాల్సి ఉంది.