షర్మిల ధీమా అతిగా ఉందా...!?
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీలోకి వెళ్లిపోయింది. అది వెనక్కు రావడం అంటే సాధ్యం కాదనే చెప్పాలి. అంతే కాదు కొంత ఓటు టీడీపీ ఇతర పార్టీలలోకి వెళ్ళింది.
By: Tupaki Desk | 17 Jan 2024 12:30 AM GMTఏపీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిలను నియమించారు. ఇది అంతా అనుకున్నదే. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న సామెత ఎటూ ఉంది. ఏపీలో కాంగ్రెస్ పొజిషన్ ఏంటి అన్నది చర్చకు ఎపుడూ వస్తూనే ఉంటుంది. ఆ పార్టీని జనాలు మరచిపోయిన నేపధ్యం ఉంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే తమిళనాడులో కాంగ్రెస్ ఒకపుడు పాలించేది. కానీ అక్కడ డీఎంకే అన్నా డీఎంకే అని రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా బలపడ్డాక కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది.
ఎపుడూ అధికారంలోకి వచ్చింది లేదు కాంగ్రెస్ ఆరు దశాబ్దాల క్రితమే తమిళనాడులో అధికారం నుంచి తప్పుకుంది. అయితే డీఎంకే లేకపోతే అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉనికి చాటుకుంటూనే వస్తోంది. తమిళనాడుకు కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏమీ లేదు. కానీ ద్రవిడ పార్టీల ప్రభావం స్వాభిమానం సిద్ధాంతాలు ఏర్పాటు అయిన ప్రాంతీయ పార్టీల ఊపుతో కాంగ్రెస్ కి అక్కడ కాలం చెల్లింది.
ఇక పశ్చిమ బెంగాల్ లో చూస్తే అయిదు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఉనికిలో లేదు. అక్కడ కూడా ఒకనాటి ప్రాభవం ఇపుడు ఏమీ కాకుండా ఉంది అన్నదే చరిత్ర చెబుతున్న సత్యం. అలాగే చూస్తే యూపీలో కూడా కాంగ్రెస్ లేదు. అక్కడ గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. దానికి కారణం కొత్త రాజకీయం ఎంట్రీ ఇవ్వడమే.
యూపీని 1989 నుంచి చూస్తే ఎస్పీ కొన్నేళ్ళు పాలించింది. బీఎస్పీ మరికొన్నాళ్లు పాలించింది. ఈ మధ్యలో బీజేపీ కూడా పాలించింది. కానీ కాంగ్రెస్ కి మాత్రం జనాలు ఏ కోశానా అవకాశం ఇవ్వలేదు. బీహార్ కధ కూడా అంతే అక్కడా కూడా సొంతంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు అయింది.
ఇవన్నీ ఎందుకు అంటే ఏపీలో కూడా కాంగ్రెస్ కధ అలాగే ఉంది అని చెప్పడానికి అంటున్నారు. ఏపీలో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ అయితే లేదు. ఆ పార్టీ ఏపీలో చైతన్య రహితంగా మారి రెండు ఎన్నికలు ముగిసాయి. ముచ్చటగా మూడవ ఎన్నిక అన్నది 2024లో వస్తోంది. ఈ నేపధ్యంలో ఏమైనా ఆశ ఉంటుందని వైఎస్ కుటుంబం నుంచే వైఎస్ షర్మిలను ముందు పెట్టారు.
ఆమెకే పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారు. ఈ నియామకాన్ని కనుమ వేళ కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించింది. దీని మీద వైఎస్ షర్మిల ఉద్వేగపూరితంగా రియాక్ట్ అయ్యారు. తాను కాంగ్రెస్ కి తిరిగి ప్రాణం పోస్తాను అని ఆమె అంటున్నారు. నిజమే ఆమెకు బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఆమె ఆ విధంగా మాట్లాడాలి. ఆమె ఆశావాదాన్ని కూడా ఎవరూ తప్పు పట్టేది లేదు.
కానీ ఏపీలో కాంగ్రెస్ కి ఇపుడు ఎంత స్కోప్ ఉంది అన్నది చర్చకు వస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీలోకి వెళ్లిపోయింది. అది వెనక్కు రావడం అంటే సాధ్యం కాదనే చెప్పాలి. అంతే కాదు కొంత ఓటు టీడీపీ ఇతర పార్టీలలోకి వెళ్ళింది. కాంగ్రెస్ తన ఓటు బ్యాంక్ ని వెనక్కి తెచ్చుకుంటే అధికారంలోకి రావచ్చు అని భావించడం చిత్రంగానే ఉంది అని అంటున్నారు.
వైఎస్సార్ కుమర్తెగా షర్మిల ఉంది. ఆమె ఏ ఎన్నికల్లోనూ ఇప్పటిదాకా పోటీ చేసింది. లేదు ఆమె తానుగా రాజకీయంగా రుజువు చేసుకుంటూనే కాంగ్రెస్ పార్టీని కూడా బతికించాలి. ఒక విధంగా ఇది టఫ్ టాస్క్. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆశలు షర్మిల ధీమాల వెనక అతి ఉందా అంటే అవును అనే అంటున్నారు అంతా. కాలమే ఏపీలో కాంగ్రెస్ ప్లేస్ ఏంటో చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.