టీడీపీని ఓవర్ టేక్ చేయనున్న షర్మిల..!
ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కనున్నాయి.
By: Tupaki Desk | 21 Jan 2024 12:37 PM GMTఇప్పటి వరకు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కనున్నాయి. ఈ జాబితాలోకి కాంగ్రెస్ వచ్చి చేరింది. ఇప్పటి వరకు వైసీపీపై విమర్శలు చేయడంలోనూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలోనూ టీడీపీ ముందు జాబితాలో ఉంది. వైసీపీ ప్రబుత్వానికి, సీఎం జగన్ కు కూడా.. టీడీపీ ఇప్పటి వరకు కంటిపై కునుకు లేకుండా చేసిందనే చెప్పాలి. టీడీపీలోనూ ఒకవైపు చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్ మూకుమ్మడి యుద్దమే చేశారు.
ఇక, జనసేన కూడా తానేం తక్కువ కాదన్నట్టుగా వైసీపీపై యాంటీ పాలిటిక్స్ చేయడంలో ముందుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎక్కడ మైకు పట్టుకున్నా.. వైసీపీపైవిమర్శలు చేయడం.. ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పడం తెలిసిందే. అదేసమయంలో నలుగురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం ద్వారా వారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని, ఓడించాలని కూడా పిలుపునిచ్చారు. మొత్తంగా ఇటు టీడీపీ, అటు జనసేన వైసీపీకి కంట్లో నలుసులుగా మారాయనడంలో సందేహం లేదు.
ఇప్పుడు ఈ యాంటి పాలిటిక్స్‌లో కొత్తగా షర్మిల వచ్చి చేరారు. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి.. కాంగ్రెస్ అనుకూల వోటు బ్యాంకును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ వేరు.. ఇక, నుంచి కాంగ్రెస్ వేరు.. అనే టాక్ జోరుగా వినిపిస్తోంది. వ్యక్తిగతంగా తన సోదరుడు, సీఎం జగన్‌ను వ్యతిరేకిస్తున్న షర్మిల ఇప్పుడు రాజకీయంగా మరింత వైరాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. దీంతో వాడి వేడి మాటలతో ఆమె వైసీపీని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి.
దీనిని బట్టి.. ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేనలు ఏవిధంగా వైసీపీకి ఇరకాటంగా మారాయో.. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచి ఇదే పరిస్థితి కల్పించే అవకాశం మెండుగానే ఉంటుందని పరిశీ లకులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒకరకంగా వైసీపీ ఒక పద్మవ్యూహంలో నిలబట్టినేనని చెబుతున్నా రు. ఈ వ్యూహాన్ని దాటుకుని.. రాజకీయ సవాళ్లను తట్టుకుని వైసీపీ నిలబడితే.. ఒక చరిత్ర సృష్టించినట్టే అవుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.