ఎవరికి ప్లస్ - ఎవరికి మైనస్... పాలేరు ఫిక్స్ చేసిన షర్మిల?
ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు/విలీనం విషయం షర్మిల బంగపడ్డారని, దీంతో ఆ పార్టీపై రివేంజ్ తీర్చుకునే ఆలోచనలు చేస్తున్నారని కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 30 Oct 2023 2:29 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు నిత్యం మారిపోతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా... ఎవరి నిర్ణయం ఎవరికి శాపం, మరెవరి వరం అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో కాంగ్రెస్ తో పొత్తు/విలీనం విషయం షర్మిల బంగపడ్డారని, దీంతో ఆ పార్టీపై రివేంజ్ తీర్చుకునే ఆలోచనలు చేస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమె పాలేరులోనే పక్కాగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రసవత్తర రాజకీయం నడుస్తున్న వేళ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయడానికే సిద్ధమైనట్టు తెలిసింది. గతంలో ప్రకటించినట్లుగానే పాలేరు నుంచే బరిలోకి దిగడానికి ఆమె రెడీ అవుతున్నారని సమాచారం. దీంతో పాలేరులో త్రిముఖ పోటీ తప్పదనే కామెంట్లు మొదలైపోయాయి. అండులో షర్మిల వల్ల ఎవరి ప్లస్సు, మరెవరికి మైనస్ అనే విశ్లేషణలూ తెరపైకి వస్తున్నాయి.
వాస్తవానికి పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అనే చెప్పాలి. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. అనంతరం ఆయన బీఆరెస్స్ లో చేరిపోయారు. రానున్న ఎన్నికల్లో ఆయన బీఆరెస్స్ నుంచే బరిలోకి దిగుతున్నారు.. ఇప్పటికే ఆయనకు టిక్కెట్ కూడా కన్ ఫాం అయిపోయింది. ప్రస్తుతం ఆయన ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు!
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయనున్నారు! ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు షర్మిల ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. కారణం... వైఎస్సార్ ఫ్యామిలీకి పొంగులేటి సన్నిహితుడు. మరోపక్క జగన్ ని కూడా అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందడమే కాకుండా... 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.
అనంతర బీఆరెస్స్ లో చేరిన పొంగులేటికి కేటీఆర్ తో సన్నిహితసంబంధాలు ఉన్నాయని భావించినప్పటికీ... 2019 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు! నాటి నుంచి అసంతృప్తిగా ఉన్న పొంగులేటి, బీఆరెస్స్ ను వీడారు. అనంతరం చాలా రోజుల సస్పెన్స్ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా... కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం నుంచి ఒక్క బీఅరెస్స్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనంటు సవాల్ చేశారు.
ఈ నేపథ్యంలో.. పొంగులేటిపై షర్మిల పోటీకి సిద్ధం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఒక దశలో.. పొంగులేటికి ఇబ్బంది కలిగించకుండా, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు సరికదా... పాలేరులోనే పోటీకి సై అని తెలుస్తుంది. దీంతో... షర్మిల పోటీ ఎవరికి ప్లస్, మరెవరికి మైనస్ అనే చర్చ మొదలైంది.
ఇక్కడ నుంచి షర్మిల గెలిస్తే సరే కానీ... ఆమె గెలవలేని పక్షంలో ఆమె చీల్చే ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీదే అని, ఫలితంగా పరోక్షంగా బీఆరెస్స్ కు ఈమె పోటీ హెల్ప్ చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పాలేరులో ఎలాంటి రసవత్తర రాజకీయాలు జరగబోతున్నాయనేది వేచి చూడాలి.
ఈ క్రమంలో... నవంబర్ 1 నుంచి షర్మిల పాలేరులో ఎన్నికల ప్రచారం చేస్తారని.. నవంబర్ 4న నామినేషన్ వేస్తారని తెలుస్తుంది. నవంబర్ 1 కి ఇంకా మధ్యలో ఒక్కరోజే ఉండటంతో... ఏమైనా అద్భుతం జరుగుతుందా అనేది వేచి చూడాలి!!