షర్మిల రాజకీయం ముగిసినట్లేనా...?
రేపటి రోజున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఏదో మేలు చేస్తుందని గాలిలో దీపం లాంటి ఆశతో ఆమె ఇలా చేసారు.
By: Tupaki Desk | 4 Nov 2023 9:47 AM GMTతెలంగాణాలో పార్టీ పెట్టి మూడేళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన దివంగత నేత వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల చివరికి ఎన్నికల ముంగిట చేతులెత్తేశారు. ఆమెకు ఉన్నది పోరాట పటిమ లేనిది వ్యూహ రచనా చాతుర్యం. అందువల్లనే చతికిలపడింది షర్మిల రాజకీయం అని అంటున్నారు.
ఆమె తమదైన రాజకీయాన్ని చేసుకోకుండా కాంగ్రెస్ వైపు తిరిగి ఇపుడు ఏకంగా ఆ పార్టీకే మద్దతు ఇస్తూ తన పార్టీతో పాటు తన పొలిటికల్ కెరీర్ నే ఫణంగా పెట్టేశారు అని విమర్శలు వస్తున్నాయి. నిష్టురమైన సత్యాలు నిజాలు కూడా చూడాలంటే షర్మిల రాజకీయ జీవితం దాదాపుగా ముగిసినట్లే అని అంటున్నారు.
ఆమె మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ కి. రేపటి రోజున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఏదో మేలు చేస్తుందని గాలిలో దీపం లాంటి ఆశతో ఆమె ఇలా చేసారు. ఇందుకోసం ఆమె మూడేళ్ళుగా పడిన తన కష్టాన్ని ఒక్కసారిగా జారవిడుచుకున్నారు అని అంటున్నారు.
ఏకంగా మూడువేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగిన వైఎస్ షర్మిల తన దూకుడునే రాజకీయాల్లో చూపించారు తప్ప వ్యూహాలతో ముందుకు సాగలేకపోయారు. కాంగ్రెస్ కి ఈ పరిస్థితులలో మద్దతు ఇచ్చినా ధన్యవాదాలు చెబుతుంది. ఇక షర్మిల పార్టీ బలం ఎంతో తేలలేదు. ఎందుకంటే ఆమె ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దాంతో ఆమె బలం తులసీదళం అని అనుకున్నా రేపటి రోజున కాంగ్రెస్ దాన్ని గుర్తు ఉంచుకుంటుందా అన్నదే చర్చ.
అదే విధంగా షర్మిలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమిటి హామీ ఇచ్చారు అన్నది తెలియడంలేదు. పోనీ కాంగ్రెస్ మాట మీద నిలబడి ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా ఆమె అంతకంటే ఏమీ సాధించేది ఉండదు అని అంటున్నారు. కాంగ్రెస్ లో నాయకులకు కొదవలేదు. ఎందరో ఉన్నారు. ఉన్న వారికే చోటు లేదు అంటే కొత్త వారికి ఎలా అవకాశాలు అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఇక కాంగ్రెస్ ఒక మహాసముద్రం. ఆమె కేవలం ఎంపీ కోసమే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారా అలా అనుకుంటే ఇన్నేళ్ల కష్టాలు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు అన్న ప్రశ్నలు వెంటనే వస్తాయి. ఆమె తెలంగాణా మొత్తం కలియతిరిగారు. ఇదే నా రాజకీయ కార్యక్షేత్రం అన్నారు. తాను రాష్ట్ర స్థాయి నాయకురాలిని అని చెప్పుకున్నారు. ఆమె టార్గెట్ తెలంగాణా సీఎం అయినపుడు ఆమె సొంత పార్టీతోనే చావో రేవో పోరాడాల్సి ఉందని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని మొదట అనుకుని ఉంటే కాంగ్రెస్ తో విలీనం దాకా ప్రతిపాదనలు చేసి ఉండరని అంటున్నారు అలా ఆమె కీలకమైన సమయంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరిగి ఆ మీదట కండిషన్లు కుదరక మళ్ళీ పోటీ అని ఒకసారి అని మరోసారి మాత్రం తూచ్ పోటీ చేయడంలేదు అని చెప్పడం ద్వారా తన రాజకీయ నిలకడలేని తనాన్ని చాటుకున్నారు అని అంటున్నారు.
ఇక ఆమె రాజకీయ జీవితం ఇపుడు పూర్తిగా కాంగ్రెస్ మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల రాజకీయంగా కాంగ్రెస్ తోనే తన పయనం అని చెప్పడం ద్వారా ఏమి చెప్పాలనుకున్నారో కానీ ఆమె లక్ష్యాలు ఆశలు మాత్రం ఏ కోశానా తీరే అవకాశాలు అయితే లేవనే అంటున్నారు.