Begin typing your search above and press return to search.

జగన్ ను వెంటాడుతున్న షర్మిళ... తెరపైకి జవాబు చెప్పలేని ప్రశ్నలు!

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్ పరిస్థితిని చూసి ఇప్పటికే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 July 2024 10:39 AM GMT
జగన్  ను వెంటాడుతున్న షర్మిళ... తెరపైకి జవాబు చెప్పలేని  ప్రశ్నలు!
X

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్ పరిస్థితిని చూసి ఇప్పటికే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పైగా గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న ఆయనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే దక్కడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

అంతకముందు... ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఇంటా బయటా అన్నట్లుగా... బయట కూటమి నేతలు, ఇంట వైఎస్ షర్మిళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వైఎస్ వివేకా హత్యపేరు చెప్పి జగన్ కి ఊపిరాడకుండా చేశారు షర్మిళ. ఇక ఎన్నికలు అయిపోవడం, ఫలితాలు రావడం, అన్నా చెల్లెల్లిద్దరూ పార్టీల పరంగా ఘోరంగా ఓడిపోవడం జరిగింది!

ఈ క్రమంలో ఆ ఘోర ఓటమి నుంచి జగన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఇటీవల వైఎస్సార్ 75వ జయంతి జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రికి నివాళులు అర్పించి వచ్చారు. ఆ సమయానికి అక్కడే ఉన్న తన తల్లిని మౌనంగా పలకరించారు. అంతకు మించి వైసీపీ తరుపున ఎలాంటి భారీ కార్యక్రమం చేసిందిలేదు! తాజాగా ఇదే విషయాన్ని ప్రస్థావించారు షర్మిల!

అవును... ఎన్నికల సమయంలో సిద్ధం సిద్ధం అంటూ భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించిన జగన్... తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతికి ఏమి చేశారు అని ప్రశ్నించారు. ఇడుపులపాయకు వెళ్లి కనీసం కూర్చోను కూడా కూర్చోకుండా ఐదే ఐదు నిమిషాలు నిల్చుని వచ్చేశారని.. పార్టీ తరుపున ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించలేదని మండిపడ్డారు.

ఇదే సమయంలో... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనే కానీ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదని... ఆయనకూ, వైసీపీకీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అమ్మఒడి హామీ జగన్ కు గుర్తులేదా?:

ప్రస్తుతం ఏపీలో "తల్లికి వందనం" పథకంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల వేళ హామీలు ఇచ్చారు. అయితే... తాజాగా తల్లికి రూ.15,000 అనే అంశం తెరపైకి రావడంతో.. ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే అనే క్లారిటీ వచ్చేసింది. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే... తల్ల్కి వందనం విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు గురివింద గింజ తరహాలో ఉన్నాయి అన్నట్లుగా షర్మిల స్పందించారు. ఇందులో భాగంగా... 2019 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ కూడా "అమ్మఒడి" పథకం కింద ఇంట్లో చదువుకుంటున్న ప్రతీ బిడ్డకూ రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇదే సమయంలో... నాటి ఎన్నికల ప్రచారంలో బై బై బాబు క్యాంపెయినింగ్ లో భాగంగా ఇదే హామీని తనతోనూ చెప్పించారని షర్మిళ గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత తల్లికి మాత్రమే రూ.15,000 ఇచ్చారని అన్నారు. అయితే... జగన్ కు ఆ విషయం గుర్తులేదేమో అని షర్మిల ఎద్దేవా చేశారు.

మరోపక్క షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ "ఎక్స్" వేదికగా రియాక్ట్ అయ్యింది. ఇందులో భాగంగా... ఇచ్చిన హామీలను అమలుచేయని చంద్రబాబుని కాపాడేందుకు ఇంతలా దిగజారిపోవాల షర్మిల.. 2019 మేనిఫెస్టోలో ఏముందో నీకు తెలియదా? అని ప్రశ్నించింది.