షర్మిల సందేహాలను పెమ్మసాని నివృత్తి చేసినట్లేనా?
ఈ సమయంలో... కూటమి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం అంటూ వైసీపీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. కేంద్రమంత్రి మాటలకు వివరణ రాసుకొచ్చింది!
By: Tupaki Desk | 30 July 2024 2:23 PM GMTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ పలు పథకాలకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ హామీల విషయంలో చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై పలువురు విశ్లేషకులు భావానువాదం చేస్తూ ప్రజానికంలో ఆందోళన కలిగిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయమేస్తోంది అనడానికి.. హామీలు అమలు సాధ్యం కాదని చెప్పడానికీ చాలా తేడా ఉందనేది మరికొందరి వాదన! ఈ సమయంలో... కూటమి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం అంటూ వైసీపీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ.. కేంద్రమంత్రి మాటలకు వివరణ రాసుకొచ్చింది!
పెమ్మసాని ఏమన్నారంటే...?:
ఆ వీడియోలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందిస్తూ... ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే ఆయుష్మాన్ భారత్ ను వినియోగించుకోవచ్చని.. ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేయడానికి అవసరమైనన్ని డబ్బులు లేవని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రులకు బిల్లులు రావట్లేదని, రోగులకు ట్రీట్ మెంట్ కూడా జరగనటువంటి పరిస్థితి అని అన్నారు!
అనుమానాలు కలుగుతున్నాయన్న షర్మిళ!:
ఇలా ఆరోగ్యశ్రీపై పెమ్మసాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. తొలుత... ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని (టీడీపీ) చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయంటూ మొదలుపెట్టిన షర్మిళ... ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇకపై రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా..? అని సూటిగా ప్రశ్నించారు.
ఇదే సమయంలో... ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలని అనుకుంటున్నారా..? ఆరోగ్యశ్రీని నిలిపేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా..? అందుకే ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా..? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదని చెప్పే సమాధానం దేనికి సంకేతం..? ఆయుష్మాన్ కింద ఇచ్చే 5 లక్షలతో సరిపెడితే ఇక రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా..? అని నిలదీశారు!
ఫైనల్ గా ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా..? అని ప్రశ్నించిన షర్మిళ... గత ప్రభుత్వం 16వందల కోట్ల బకాయిలు పెండింగులో పెడితే.. ఆస్పత్రుల్లో కేసులను తీసుకోవడం మనేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు ఏకంగా పథకం అములుకే పొగ పెట్టేలా ఉన్నాయి అని అంటూ... దీనికి చంద్రబాబు, పవన్ లు వెంటనే సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
షర్మిళ సందేహాలపై పెమ్మసాని వివరణ!:
ఇలా ఎక్స్ వేదికగా షర్మిళ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన సందేహాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ఇందులో భాగంగా షర్మిళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు! ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్.. ఆరోగ్యశ్రీకి ప్రత్యామ్నాయం కాదని, ప్రజలకు ఆరోగ్య శ్రీ సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్ అంతర్భాగమే!:
దీంతో... ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పెమ్మసాని చెప్పిన ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్యశ్రీలో అంతర్భాగమే అని.. కానీ, కేంద్రం ఇచ్చేది ఏడాదికి రూ.350 కోట్లు మాత్రమే అని వైసీపీ వెల్లడించింది. కూటమి ప్రభుత్వం రాకముందు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద జగన్ ఏడాదికి రూ.4,100 కోట్లు ఖర్చు చేశారని తెలిపింది. అందులో ఆయుష్మాన్ భారత్ కింద వచ్చే రూ.350 కోట్లు ఏపాటికని ప్రశ్నించింది.
ఇదే సమయంలో... ఆయుష్మాన్ భారత్ కింద గరిష్ట పరిమితి రూ.5 లక్షలు మాత్రమే అని.. కానీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు జగన్ సర్కార్ పెంచి ఇచ్చిందని వైసీపీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఏది ఏమైనా ఆరోగ్యశ్రీని ఎత్తేసి, కేవలం ఆయుష్మాన్ భారత్ తో సరిపెడుతున్నారన్నమాటేగా అని నిలదీసింది!
నెటిజన్ల సందేహాలు!:
రూ.25 లక్షల పరిధి ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి... అందులో అంతర్భాగమని చెబుతున్న రూ.5 లక్షల లిమిట్ ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకం... ఆరోగ్య సేవలను ఎలా విస్తరిస్తుంది అనేది ఈ సందర్భంగా తెరపైకి వస్తున్న మరో ప్రశ్న! అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్లాలా.. లేక, ఆయుష్మాన్ భారత్ కార్డు పట్టుకుని వెళ్లాలా అనేది ఇంకో ప్రశ్న!
దీంతో... ఈ వ్యవహారంపై ఏపీ ప్రజానికానికి మరింత స్పష్టమైన వివరణ అవసరం అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి!