Begin typing your search above and press return to search.

ఒక్కొక్క ఎంపీకి వెయ్యి కోట్లన్న మాట?... షర్మిళ సెటైర్లు!

ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ స్పందించారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై ఫైరయ్యారు. తనదైన శైలిలో బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

By:  Tupaki Desk   |   24 July 2024 4:54 AM GMT
ఒక్కొక్క ఎంపీకి వెయ్యి కోట్లన్న మాట?... షర్మిళ సెటైర్లు!
X

మంగళవారం కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏపీ, బీహార్ కి మాత్రమే ఈ బడ్జెట్ లో న్యాయం చేశారని ఒకరంటే... ఏపీకి అప్పు ఇచ్చారు, బీహార్ కి గ్రాంట్ ఇచ్చారు, ఆ తేడా గమనించాలని ఇంకొకరు అంటున్నారు. ఇక బడ్జెట్ లో తెలంగాణ అనే పేరే ఉచ్చరించలేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది.

మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15,000 కోట్లు సమకూర్చుకోవడానికి సహకరిస్తామని నిర్మల సీతారామన్ ప్రకటించారు. సహకారం ఏ రూపంలో వచ్చినా ఇప్పటి పరిస్థితుల్లో అది ఉపయుక్తమే అంటూ చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ తో పాటు ఏపీ బీజేపీ నేతలూ తమ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రకటించారు. మరోపక్క ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు!

ఇలా ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో 15వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి సహకరిస్తామని వెల్లడించడంపై రకరకాల అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ స్పందించారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై ఫైరయ్యారు. తనదైన శైలిలో బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.

అవును... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.15,000 కోట్ల వ్యవహారం వైఎస్ షర్మిళ స్పందించారు. ఇందులో భాగంగా... అసలు రాష్ట్ర రాజధాని కోసం రూ.15,000 కోట్లు అప్పుగా ఇచ్చారా.. లేక, గ్రాంటుగా ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో... 15 మంది ఎంపీలను మద్దతుగా ఇచ్చినందుకు ఒక్కో ఎంపీకి రూ.1000 కోట్ల చొప్పున కొనుగోలు చేశారా? అన్నట్లుగా ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు షర్మిళ.

ఇదే సమయంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను బడ్జెట్ అనడం కంటే.. ఎన్నికల మేనిఫెస్టో అనడం బెటరని.. అదైతేనే ఏదైనా చెప్పొచ్చు, ఎన్నైనా పెట్టొచ్చని ఎద్దేవా చేశారు. కానీ... బడ్జెట్ అయితే నెంబర్స్ తో కూడిన డిటైల్స్ ఇస్తూ, టైం ఫ్రేం చెబుతూ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏపీ గురించి నాలుగు అంశాలుమాత్రమే మాటాలాడారని అంటూ.. వాటిని వివరించే ప్రయత్నం చేశారు షర్మిళ.

ఇందులో భాగంగా... బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే తమ రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టుల నిమిత్త సంవత్సరానికి రూ.లక్ష కోట్లు అవసరం ఉంటుందని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసిన షర్మిల... అసలు ఆ లక్ష కోట్లు అనే క్లారిటీకి చంద్రబాబు ఎలా వచ్చారో తెలియదని అన్నారు. విభజ చట్టంలోని అన్ని హామీలను విలువ కడితే సుమారు 12 నుంచి 15 లక్షల రూపాయలు అవుతుందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని కేంద్రం పెద్దలు చెప్పడాన్ని స్వాగతించిన షర్మిళ... అది ఎప్పటి లోగా పూర్తిచేస్తారనే విషయాలపై క్లారిటీ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఇలా ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారు తప్ప క్లారిటీ ఇవ్వలేదని.. నర్మగర్భ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా... ఏపీ విభజన సమయంలో ఈ రాష్ట్రానికి హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు.. ఇది ఏమైంది? అని షర్మిళ ఫైర్ అయ్యారు!