వైఎస్సార్ ను తిట్టినవారు జగన్ కు తండ్రి సమానులా... షర్మిళ ఘాటు వ్యాఖ్యలు!
ఈ సమయంలో బొత్స సత్యనారాయణను.. తన తండ్రి సమానులు అని అనడంపై షర్మిళ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
By: Tupaki Desk | 24 April 2024 10:23 AM GMT"మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు సీఎం జగన్ తనదైన శైలిలో పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తనకు వారితో ఉన్న పరిచయం మేరకు, వారి వారి వయసు, హోదాల మేరకు జగన్ వారికి ఆత్మీయంగా ప్రస్థావిస్తూ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఈ సమయంలో బొత్స సత్యనారాయణను.. తన తండ్రి సమానులు అని అనడంపై షర్మిళ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
అవును... తాజాగా "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందులో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు.. పైకి అన్నా అని పిలుస్తాను కానీ, తనకు తండ్రి సమానులని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఆ సమయంలో జనం కేరింతలు కొట్టగా మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సమయంలో ఆ వ్యవహారంపై స్పందించిన వైఎస్ షర్మిళ... అసెంబ్లీలో వైఎస్సార్ ను బొత్స సత్యనారాయణ.. తాగుబోతు అని తిట్టారని.. ఆన్ ద రికార్డ్ విమర్శించారని.. జగన్ కు ఉరిశిక్ష వేయాలని అన్నారని.. వైఎస్సార్ భార్య విజయమ్మను కూడా విమర్శించారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ కు తండ్రి సమానులయ్యారా అంటూ షర్మిళ ప్రశ్నించారు.
ఇదే సమయంలో... ఇప్పుడు జగన్ క్యాబినెట్ లో ఉన్న చాలా మంది వైఎస్సార్ ని తిట్టినవారే అని అంటూ... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విడదల రజని, ఆర్కే రోజా మొదలైన పేర్లను షర్మిల ప్రస్థావించారు. ఈ సందర్భంగా వీరంతా జగన్ కు తండ్రులు, అన్నలూ, చెల్లెల్లూ అయిపోయారు కానీ... నిజంగా తన కోసం నిలబడినవారు, పాదయాత్రలు చేసినవారూ ఏమీ కారని చెప్పుకొచ్చారు!
ఇదే క్రమంలో... ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వారూ ఏమీ కారని చెబుతూ... ఇప్పుడు ఇలాంటి వాళ్లను పక్కనపెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా... వైఎసార్సీపీ పార్టీలో అసలు వైఎస్సార్ లేరని చెప్పిన షర్మిళ... వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని వ్యాఖ్యానించారు.