షర్మిల పరిస్థితి మోత్కుపల్లి కంటే దారుణమా?
తెలంగాణలోని వెటరన్ లీడర్ అయిన మోత్కుపల్లి నర్సింహులుకు ఉన్నంత సీన్ కూడా షర్మిలకు లేకుండా పోయిందని సెటైర్లు వేస్తున్నారు.
By: Tupaki Desk | 30 Sep 2023 2:30 AM GMTరాజకీయాల్లో ఓడలు బళ్లు... బళ్లు ఓడలు అవడం కొత్తేం కాదు. అలాంటి బాధకరమైన పరిస్థితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలది. ఓ వెలుగు వెలిగిపోవాలని భావించిన ఈ మహిళా నేతకు అది సాధ్యం కాకపోగా... ఆమె పెట్టిన పార్టీ నవ్వుల పాలయ్యే పరిస్థితికి చేరిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలోని వెటరన్ లీడర్ అయిన మోత్కుపల్లి నర్సింహులుకు ఉన్నంత సీన్ కూడా షర్మిలకు లేకుండా పోయిందని సెటైర్లు వేస్తున్నారు.
తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణలో తన సత్తా చాటుకోవాలని భావించిన షర్మిలకు కొద్దికాలంలోనే తనకు ఉన్న మద్దతుపై స్పష్టత వచ్చింది. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసేందుకు మార్గాలు వెతుక్కోవడం వరకు పరిస్థితి మారిపోయింది. తమ పార్టీలో ఎవరినీ చేర్చుకోబోమని లీడర్లను సృష్టిస్తామని చెప్పిన స్థితి నుంచి పార్టీని వీడేవారే ఎక్కువయ్యారు. పార్టీ ప్రారంభంలో ఉన్న నేతలు కూడా పార్టీ వీడటంతో మరింత అధ్వాన్న స్థితికి వెళ్లింది. మరోవైపు నేడే రేపో విలీనం అన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి. ఆఖరికి ఎటూ తేలకపోవడంతో.... వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల తన విలీనం గురించి కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ విధించారు. కాంగ్రెస్‌కు పెట్టిన డెడ్ లైన్ ఈనెల 30వ తేదీతో ముగియనుండగా హస్తం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా లైట్ తీసుకుంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో విలీనానికి చక్రం తిప్పి హైకమాండ్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా ఇంత కష్టపడ్డప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు అందలేదు. దీంతో ఇటీవల షర్మిల నేరుగా.. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసింది. అయినా ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడం గమనార్హం. మరోవైపు తాజాగా తెలంగాణ పాలిటిక్స్‌లోని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. కానీ షర్మిలకు సైతం డీకే అపాయింట్‌మెంట్ దొరకట్లేదా? అనే టాక్ వినిపిస్తోంది.
అయితే, షర్మిల విలీనం కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల గతంలో ప్రకటించారు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బంది అని భావించిన రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల నాగేశ్వర్ రావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారనే చర్చ జరుగుతోంది. షర్మిల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుతుందనే విషయంలో రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పలు నివేదికలు కూడా పంపించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టమని స్థానిక నేతలు ఎన్నో రోజులుగా అడ్డుకుంటున్నారు. దీంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకొని..షర్మిలను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకున్నట్లు సమాచారం.