Begin typing your search above and press return to search.

షర్మిల కొడుకు పెళ్లి.. జగన్‌ ఫ్రెండ్స్‌ కంటే శత్రువులే ఎక్కువ!

వీరి ప్రేమకు ఇరు వైపులా పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 9:30 AM GMT
షర్మిల కొడుకు పెళ్లి.. జగన్‌ ఫ్రెండ్స్‌ కంటే శత్రువులే ఎక్కువ!
X

కొత్త సంవత్సరం వేళ.. కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ షర్మిల సంచలన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం జరుగుతుందని తెలిపారు. వీరిద్దరూ అమెరికాలో బిజినెస్‌ మేనేజ్మెంట్‌ కోర్సు చదువుతూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమకు ఇరు వైపులా పెద్దలు అంగీకారం తెలపడంతో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇందులో భాగంగా జనవరి 18న నిశ్చితార్థ వేడుక జరుగుతుంది.

ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులతో కలిసి షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ ను సందర్శించి అక్కడ తొలి శుభలేఖను ఉంచారు.

మరోవైపు తన కుమారుడి పెళ్లికి పలువురు అతిథులను షర్మిల ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తన సోదరుడు, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ను తాడేపల్లిలో కలిసి శుభలేఖను అందించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అలాగే ఇంకా పలువురు రాజకీయ నేతలను ఆహ్వానించే పనిలో షర్మిల బిజీగా ఉన్నారు.

అయితే షర్మిల ఆహ్వానిస్తున్నవారిలో తన సోదరుడు వైఎస్‌ జగన్‌ కు ఆప్తులు, స్నేహితులు కంటే శత్రువులే ఎక్కువ ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పట్ల జగన్‌ కు సానుకూలత లేదని సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక మర్యాదకు కూడా జగన్‌.. రేవంత్‌ ను అభినందించిన పాపాన పోలేదని అంటున్నారు. స్వయంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డే ఈ విషయాన్ని తెలిపారు.

అలాగే షర్మిల తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినవారిలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కూడా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ కు అసలు పడనివారిలో వేమూరి రాధాకృష్ణ ఒకరు. సందర్భం వచ్చిన ప్రతిసారీ జగన్‌.. రాధాకృష్ణపై, ఆంధ్రజ్యోతిపై నిప్పులు చెరుగుతుండటం తెలిసిన విషయమే.

మరోవైపు షర్మిల ఇటీవల క్రిస్మస్‌ రోజున నారా లోకేశ్‌ కు శుభాకాంక్షలు తెలుపుతూ గిప్టును పంపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ను కూడా పెళ్లికి పిలవవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో షర్మిల కుమారుడి పెళ్లికి వీరంతా హాజరవుతున్నట్టే. అలాగే సొంత మేనల్లుడి పెళ్లి కావడంతో వైఎస్‌ జగన్‌ కూడా రాక తప్పదంటున్నారు. పెళ్లిక రాకపోతే షర్మిలతో విబేధాలు నిజమేనన్న సంగతిని ఆయనే ఒప్పుకున్నట్టు అవుతుందని చెబుతున్నారు. పెళ్లికి వస్తే ఆ పెళ్లిలో తనకు ఏమాత్రం ఇష్టం లేని రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు, లోకేశ్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ వంటివారికి ఎదురుపడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇది జగన్‌ కు ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు.