షర్మిల తనయుడి వివాహానికి జోధ్ పూర్ ప్యాలెస్ సిద్ధం... మేనమామ?
అవును... వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి - అట్లూరి ప్రియల వివాహ వేడుక ఈనెల 17వ తేదీన జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 15 Feb 2024 5:04 AM GMTఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్ధ వేడుక జనవరి 18న హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వైఎస్ షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరైన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.. ఈ క్రమంలో వివాహ వేడుకకు సర్వం సిద్ధమైందని తెలుస్తుంది. అయితే... ఈ కార్యక్రమానికి జగన్ హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అవును... వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి - అట్లూరి ప్రియల వివాహ వేడుక ఈనెల 17వ తేదీన జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. దీంతో... బుధవారం సాయంత్రమే షర్మిల.. కుటుంబ సమేతంగా జోధ్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు!
ఈ క్రమంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా... 16వ తేదీ సంగీత్, మెహందీ కార్యక్రమం ఉంటుంటుండగా.. 17వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒకటి కానున్నారు. ఇక 18వ తేదీ ఉదయం 11 గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆపై అదేరోజు సాయంత్రం 7 గంటలకు తలంబ్రాలు వేడుకను నిర్వహించనున్నారు.
అయితే తన కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరు కావాలంటూ పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల... కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించినట్లు తెలుస్తుంది! ఇదే సమయంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ లను కూడా ఆహ్వానించారని అంటున్నారు.
ఇదే సమయంలో ఈ వివాహ వేడుకకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. వీరితో పాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకరిద్దరు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో పలువురు సినీ ప్రముఖులూ హాజరుకానున్నారని తెలుస్తుంది. అయితే ఈ వివాహ వేడుకలో పెళ్లికొడుకు మేనమామ జగన్ కనిపిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.