Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కామ్రెడ్స్‌.. ఏపీలో సంచ‌ల‌నం!

త‌న సోద‌రుడే అయినా.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబును మించి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 10:18 AM GMT
కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కామ్రెడ్స్‌.. ఏపీలో సంచ‌ల‌నం!
X

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిశాయి. లెక్క‌లు కూడా తేలిపోయాయి. గెలుపు గుర్రాన్ని ఎక్కిన పార్టీలు జోష్‌లో ఉన్నాయి. ప‌ద‌వులు పంచుకుని.. పాల‌న కూడా ప్రారంభించాయి. ఇక‌, ఓడిపోయిన పార్టీలు ఇంకా తేరుకోలేదు. కానీ, ఇప్పుడిప్పుడే పోస్టు మార్ట‌మ్ చేసుకుంటున్నాయి. వైసీపీ చిత్తుగా ఓడిపోయిన ద‌రిమిలా.. త‌ప్పులు వెతుక్కుంటున్నా.. ఆ త‌ప్పు ఎక్క‌డ‌.. ఏ కేంద్రంలో జ‌రిగిందో అంద‌రికీ తెలిసిపోయి.. మౌనంగా 'భ‌రిస్తున్నారు!' కొంద‌రు బ‌య‌ట‌కు చెప్పుకొంటున్నారు.

ఇదిలావుంటే.. ఈ ఎన్నిక‌ల్లో `ధూం... త‌తా!` అంటూ అరంగేట్రం చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి 10-15 స్థానాలు, పార్ల‌మెంటుకు 4-6 స్థానాలు ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకు ఉరికింది. భారీ ఎత్తున పాత పారిశ్రామిక మిత్రుల‌ను ప‌ట్టుకువ‌చ్చి.. ఖ‌ర్చు కూడా బాగానే పెట్టించింది. ఇక‌, మాజీ సీఎం, దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారాల ప‌ట్టి వైఎస్ ష‌ర్మిల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించి.. ఏపీలో ప్ర‌చారాన్ని నెక్ట్స్ లెవిల్‌కు తీసుకువెళ్లింది. ష‌ర్మిల ప్ర‌చారంతో మైకులు విరిగిపోయాయి. సౌండ్ బాక్సులు పేలిపోయాయి.

ఆ రేంజ్‌లో ఆమె మాట‌ల తూటాలు పేల్చారు. త‌న సోద‌రుడే అయినా.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబును మించి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. క‌న్నీరు కార్చారు.. కొంగు చాపారు. క‌డ‌ప నుంచి పోటీ చేశారు. గెలుపు త‌న‌ది కాక‌పోతే.. అన్యాయం గెలిచిన‌ట్టేన‌ని కూడా చెప్పారు. క‌ట్ చేస్తే.. క‌మ్యూనిస్టుల‌తోనూ చేతులు క‌లిపి సీపీఐ, సీపీఎంల‌కు చెరో కొన్ని సీట్లు పందేరం కూడా చేశారు. ఇంకే ముంది.. ష‌ర్మిల వెంట క‌మ్యూనిస్టులు కూడా.. కాలు క‌దిపారు. జెండాల‌క‌లిపారు.

ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు వ‌చ్చాయి. క‌ట్ చేసి.. పోస్టు మార్టం చేస్తే.. క‌మ్యూనిస్టు కామ్రేడ్స్‌.. ష‌ర్మిల కు.. బిగ్ హ్యాండిచ్చార‌ని తేలిపోయింది. ఈ విష‌యంలో ఎవ‌రో చెప్ప‌కుండానే.. ప‌లు చోట్ల గెలిచిన టీడీపీప నాయ‌కులే వెల్ల‌డించేశారు. ``మాకు అంత‌ర్గ‌తంగా కామ్రెడ్లు క‌లిసి వ‌చ్చారు`` అంటూ నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ వైసీపీనాయ‌కుడు.. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఒక‌రు వ్యాఖ్యానించారు.

దీంతో కాంగ్రెస్ ల‌బ్ధ‌ప్ర‌తిష్టులు ఇదే విష‌యం ఆరాతీయ‌గా.. కామ్రెడ్లు నిజ‌మేన‌ని చెప్పుకొచ్చార‌ని స‌మాచారం. ``మేం కంట్రోల్ చేశాం. కానీ, చేయి దాటి పోయింది. మావోళ్లు టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు అనుకూలంగా ప‌నిచేశారు. గ‌తంలో ఉన్న ప‌రిచ‌యాలు ప‌నిచేశాయ‌ని గుర్తించాం. త‌ప్పు జ‌రిగిపోయింది`` అని ఆయా పార్టీల పెద్ద కామ్రేడ్లు కూడా ఒప్పేసుకున్నార‌ట‌. దీంతోనే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి ప‌ది రోజులు అయినా.. ఒక్క క‌మ్యూనిస్టు నాయ‌కుడు కూడా.. మీడియా ముందుకు రాలేద‌ని అంటున్నారు. మొత్తానికి ష‌ర్మిల‌క్క‌కు పెద్ద ఎఫెక్టే ప‌డింద‌ని తాజా చ‌ర్చ‌!!