'కడప రెడ్డెమ్మ'... తీర్పు చారిత్రకం కానుందా ?
కడప.. ఒకప్పుడు ఈ జిల్లాపై పెద్దగా చర్చలు ఉండేవి కాదు. ఓటింగ్ అంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఏకపక్షంగా పడేవి.
By: Tupaki Desk | 26 May 2024 5:30 PM GMTకడప.. ఒకప్పుడు ఈ జిల్లాపై పెద్దగా చర్చలు ఉండేవి కాదు. ఓటింగ్ అంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఏకపక్షంగా పడేవి. తర్వాత.. వైసీపీ వచ్చింది. అప్పుడు కూడా.. ఏకప క్షంగా వైసీపీకి పడుతూ వచ్చాయి. దీంతో వైసీపీ అధినేత జగన్.. ఎప్పుడూ.. కడప గురించి పెద్దగా పట్టిం చుకునేవారు కాదు. ఎన్నికల సమయంలోనూ ఆయన కడప మినహా.. ఇతర జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు.. 2014. 2019 ఎన్నికల్లో జగన్.. కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే కడపలో పర్యటించారు.
కానీ, తాజాగా జరిగిన ఎన్నికలలో మాత్రం... జగన్.. 6 సార్లు కడపలో పర్యటించారు. తొలిసారి బస్సు యా త్ర ప్రారంభించింది కూడా ఇక్కడ నుంచి ఆ తర్వాత.. వరుసగా 5 సార్లు వెళ్లారు. ప్రచారం చేశారు. చివరి రోజు కూడా ఆయన కడపలో ప్రచారం చేసి.. ఆ తర్వాత.. పిఠాపురంలో ప్రచారాన్ని ముగించారు. ఇంత ఉత్కంఠగా కడప రాజకీయాలు మారడానికి కారణం.. కడప రెడ్డెమ్మగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిల.
ఠారెత్తిన వ్యాఖ్యలతో సీఎం జగన్‌పైనా.. ఆయన ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. అవినాష్ రెడ్డికి.. వివేకా హత్యకు లింకు పెట్టి ప్రచారం చేశారు. మొత్తంగా ప్రచారాన్ని షర్మిల. సునీతలు.. దుమ్ము రేపడం తో జగన్.. ఈ సారి కడప పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకటికి నాలుగు సార్లు ప్రచారం చేసుకున్నారు.. కట్ చేస్తే.. ఇక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉందనే విషయంపై తాజాగా ఇక్కడి వారు స్పందిస్తున్నారు.నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొంత గ్యాప్ దొరకడంతో వారి మనసులోని భావాలు బయట పెడుతున్నారు.
``మాకు రాజన్నకుటుంబం అంటే ప్రాణం. ఎవరినీ పోగొట్టుకునేది లేదు. ఒక ఓటు షర్మిలకు, ఒక ఓటు జగన్‌బాబుకు వేశాం`` అని నిర్మొహమాటంగా కొందరు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. అంటే.. అసెంబ్లీ ఓటును జగన్‌కు, పార్లమెంటు ఓటును షర్మిలకు వేశారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. రెండు మూడు ఆన్‌లైన్ చానెళ్లు చేసిన పోస్ట్ పోల్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు ఇదే అభిప్రాయం చెప్పారు. దీంతో కడప రెడ్డెమ్మ గెలుపు ఖాయమని అంటున్నారు పరిశీలకులు .ఇదే జరిగితే.. కడపలో చారిత్రాత్మక తీర్పు వచ్చినట్టేనని.. వైఎస్ కుటుంబాన్ని ఈ జిల్లా వదులు కోదని అంటున్నారు.