Begin typing your search above and press return to search.

డేటూ, టైమూ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరె - షర్మిల మాస్ సవాల్

తాజాగా... ఏపీ పీసీసి చీఫ్ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల నేటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు.

By:  Tupaki Desk   |   23 Jan 2024 7:22 AM GMT
డేటూ, టైమూ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరె - షర్మిల మాస్ సవాల్
X

తాజాగా... ఏపీ పీసీసి చీఫ్ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల నేటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా.. నేడు శ్రీకాకుళం నుంచి మొదలైన ఈ పర్యటన వరుసగా 9 రోజుల పాటు కొనసాగిన అనంతరం జనవరి 31న వైఎస్సార్ కడప జిల్లాల్లో ముగియనుంది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆమె ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అవును... ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన షర్మిల నేటి నుంచి జిల్లల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా... ఈ సమావేశాలకు వెళ్లేందుకు ఆమె ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి పలాసలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ బస్సులో షర్మిలను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆ షాక్ నుంచి తేరుకుని.. ఆమెతో ముచ్చటించారు.

ఈ సమయంలో వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలు మాణిక్కం ఠాకూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి కూడా ఆర్టీసీ బస్సు ఎక్కినవారిలో ఉన్నారు. ఈ సమయంలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె బస్సులోనే ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, వాటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా... తనను పక్కరాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించడంపై ఆమె స్పందించారు. తాను జగన్ రెడ్డి అనడం సుబ్బారెడ్డికి నచ్చలేదని.. ఇకపై "జగనన్న గారూ" అనే పిలుస్తానని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై స్పందించిన బాబాయ్ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు.

ఇందులో భాగంగా... తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల... ఏపీలో మీరు చేసిన అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని.. డేటూ, టైమూ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరె అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తనతో పాటు మీడియా, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు కూడా వస్తారని అన్నారు.

కాగా... ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు? మాతో పాటు షర్మిల వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తాం" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... వైఎస్సార్‌ కు నిజమైన వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు!