షర్మిలను ట్రోల్ చేస్తే నష్టపోయేది వైసీపీనే...!
వైఎస్ షర్మిల అనూహ్యంగా ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె తెలంగాణా నుంచి ఏపీ వైపు వస్తారని వైసీపీ నేతలు అసలు ఊహించలేదు
By: Tupaki Desk | 29 Jan 2024 5:43 AM GMTవైఎస్ షర్మిల అనూహ్యంగా ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె తెలంగాణా నుంచి ఏపీ వైపు వస్తారని వైసీపీ నేతలు అసలు ఊహించలేదు. ఆమె కూడా తన రాజకీయం అంతా తెలంగాణాలోనే అంటూ వచ్చారు. తాను ఆడపిల్లను అని చెప్పుకున్నారు. తాను జీవితమంతా తెలంగాణాలోనే ఉంటూ రాజకీయం చేస్తాను అన్నారు.
కానీ పార్టీ పెట్టి పాదయాత్రను వేల కిలోమీటర్లు చేసి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని మూసేసి కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ మీదట కూడా ఆమె తెలంగాణాలోనే రాజకీయం చేస్తారు అనుకున్నారు. కానీ అటు నుంచి ఇటు ఆమె వచ్చారు.
ఇపుడు వైసీపీ నుంచి అదే ప్రశ్న వస్తోంది. ఆడ పిల్లను అన్న షర్మిలకు ఏపీతో పనేంటి అని. అయితే షర్మిల మాత్రం తన గొంతుని బాగానే సవరించుకుంటున్నారు. ఏపీ తన పుట్టిల్లు అంటున్నారు. పుట్టిల్లు అభివృద్ధి లేకుండా ఇబ్బందులలో ఉంటే తాను ఇటు వైపు రాకుండా ఎలా ఉంటాను అంటున్నారు.
సరే అది ఆమె ఇష్టం. ఆ మాటకు వస్తే రాజకీయాల్లో ఒకే మాటకు నిలబడి ఎంత మంది ఉంటారు. రాజకీయం అంటేనే ఒక క్రీడ. అక్కడ అలాగే మాట్లాడడం వర్తమానంలో ఎవరికీ ఆశ్చర్యం అయితే లేదు. సరే ఆమె కాంగ్రెస్ తరఫున వచ్చారు. ఆ పార్టీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. తన రాజకీయం ఏదో తాను చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆమె ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ని విమర్శిస్తున్నారు. అది కూడా సహజ పరిణామమే. అధికారంలో ఉన్న పార్టీనే ఎవరైనా విమర్శిస్తారు. అపుడే తమ రాజకీయానికి ఒక అర్ధం ఉంటుందని భావిస్తున్నారు. ఇక రాజకీయాల్లో సహేతుకత అన్నది ఇపుడు ఎవరూ చూడడంలేదు. అయితే అక్కడ ఉన్నది అన్న ప్రభుత్వం కాబట్టి సాఫ్ట్ కార్నర్ తో షర్మిల వ్యవహరించాలి అంటే ఎందుకు ఆమె ఆగుతారు. ఎవరి కోసం ఆగుతారు.
ముందే చెప్పినట్లుగా ఇది రాజకీయం, ఇక్కడ ఏ నియమాలూ ఉండవు. ఆ సంగతి తెలిసి కూడా వైసీపీ రాజకీయ రాయితీలు షర్మిల నుంచి కోరడమే విడ్డూరంగా ఉంది. సరే వైసీపీ పెద్దలు మైకుల ముందు వచ్చి విమర్శలు చేస్తే వైసీపీ అభిమానులు అనబడే వారు సోషల్ మీడియాలో షర్మిలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత విషయాల మీదకు కూడా వెళ్తున్నారు.
ఇది చాలా తప్పు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది. ఆమె ఆడబిడ్డ. దివంగత నేత వైఎస్సార్ తనయ. ఒక రాజకీయ పక్షం నేత. ఆమె విషయంలో విమర్శలు చేస్తే విధాన పరంగా ఉండాలి. ఏపీకి కాంగ్రెస్ ఏమి చేసింది అడ్డగోలు విభజన చేసింది లాంటివి విమర్శలుగా చేస్తే తప్పు లేదు కానీ ఆ పర్సనల్ విషయలను టచ్ చేస్తూ ట్రోల్స్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్న వస్తోంది.
షర్మిల సైతం ఇదే విషయం మీద్ హర్ట్ అయ్యారు. ఆమె తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నారు అని ఆవేదన చెందారు. ఇక షర్మిల విషయం ఆమె మొండి పట్టుదలను చూసిన వారు ఎవరూ ఆమె తగ్గుతారు అనుకుంటే పొరపాటు అంటున్నారు. ఆమె తెలంగాణాలో ఏమీ లేని చోట తాను ఒంటరిగా ఉంటూ కొండలాంటి బీయారెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద విపరీతమైన పోరాటం చేశారు.
అలాంటి ఆమె ఏపీలో జాతీయ కాంగ్రెస్ కి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ ఏ విధంగా మౌనంగా ఉంటారని అనుకుంటున్నారు అన్నదే ప్రశ్న. ఇక ఆమె సైతం ఎలాగైనా అన్న ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమె వైఖరి చూసి కూడా ఇంకా రెచ్చగొడితే నష్టపోయేది కచ్చితంగా వైసీపీయే అని అంటున్నారు.
వైసీపీ వారు మిగిలిన పార్టీల మాదిరిగానే షర్మిల మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె పర్సనల్ విషయాలు కూడా అనవసరంగా ముందుకు తెస్తున్నారు. అదే జరిగితే ఆమె కూడా తనకు తెలిసిన కుటుంబ రహస్యాలు బయట పెట్టేందుకు కూడా వెనకాడకపోవచ్చు అని అంటున్నారు. ఆమెను ఎంతలా రెచ్చగొడితె అంతలా ఆమె కూడా రెచ్చిపోతారు అని అంటున్నారు.
అపుడు పూర్తిగా ఇబ్బందిలో పడాల్సింది వైసీపీయే అని కూడా అంటున్నారు. నిజానికి ఆమె కూడా అందుకు రెడీ అయ్యే ఏపీకి వచ్చారు అని అంటున్నారు. ఆమెకు రాజకీయ అనుభవం ఎంతో కొంత ఉంది కదా. తెలంగాణాలో ఆమె అన్ని రకాలుగా అందరికీ ఎదుర్కొని వచ్చారు కదా. ఏపీలో తనను ఎలా విమర్శిస్తారో అవగాహన లేకుండా ఆమె కాంగ్రెస్ పదవి స్వీకరించి వైసీపీ ప్రభుత్వం ముందుకు వస్తారా. ఇది సింపుల్ ప్రశ్న. లాజిక్ తో ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది.
కానీ ఆమెను ట్రోల్స్ చేసే వారు మాత్రం ఇవి గుర్తించడం లేదు. సరే ఎవరికి వారు ఇందివిడ్యువల్ గా ట్రోల్స్ చేసినా ఆమె వేసే బండలు చేసే విమర్శలు మాత్రం నేరుగా తమ అభిమాన నాయకుడు జగన్ కే తగులుతాయన్న ఆలోచన లేకపోతే ఎలా అన్న చర్చ అయితే ఉంది.
ఇక్కడ షర్మిల జగన్ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఆ విషయం స్పష్టం అయిపోయింది. మరి అన్నీ తెలిసి కూడా వైసీపీ పెద్దలు ఆమె విషయంలో కాస్తా సైలెంట్ గా ఉండమని సోషల్ మీడియా లోని తమ పార్టీ వారికి చెప్పలేరా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆమెను ఎంతలా ట్రోల్స్ చేస్తే అంతలా ఆమె కూడా రెచ్చిపోవడం ఖాయం. అపుడు వైసీపీకే భారీ నష్టం అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత దాకా పోతుందో. లేక వైసీపీ నుంచి అడ్డుకట్ట వేసే సీన్ ఉంటుందో లేదో.