“షర్మిలను సోనియా పెంపుడు కూతురుగా చూస్తాం”!
దీంతో ఈ ఆరోపణలు, విమర్శలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు.
By: Tupaki Desk | 22 Jan 2024 2:56 PM GMTఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మైకందుకున్న వైఎస్ షర్మిల... ఏపీ ప్రభుత్వంపైనా, జగన్ పరిపాలనపైనా కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు. ఎక్కడ చూసినా మాఫియా రాజ్యమేలుతుందని.. రైతులపై దాడులు పెరిగాయని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఆరోపణలు, విమర్శలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఈ సమయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. షర్మిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అవును... ఏపీ సర్కార్ పైనా, వైఎస్ జగన్ పాలపైనా ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అయిన నేపథ్యంలో... తాజాగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... షర్మిలకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు పూర్తిగా స్వార్ధపూరితమైనవే తప్ప నిజాతీగా మాట్లాడిన మాటలు కాదని అన్నారు.
ఈ సందర్భంగా.. ఏపీలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదని షర్మిల వ్యాఖ్యానించడంపై రాచమల్లు ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా... అభివృద్ధి కనిపించలేదా? అని ఆయన నిలదీశారు. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం రెండు లక్షల ఏభైవేల కోట్ల రూపాయలను.. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా, లంచగొండితనం లేకుండా, రాజకీయ వివక్ష లేకుండా, దళారీ వ్యవస్థకు తావులేకుండా... వారి వారి అకౌంట్లలోకే నేరుగా డబ్బులు జమ చేస్తున్న విధానం కనిపించలేదా? అని ప్రశ్నించారు.
ఇదే క్రమంలో... పేదలను ఆదరించిన వైనం మీకు కనిపించలేదా?.. "నాడూ - నేడు" కింద ఈ రాష్ట్రంలోని విధ్యా విధానంలో సమూల మార్పులు తెచ్చిన విషయం కనిపించలేదా?.. రూ.24 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేయడం మీకు కనిపించలేదా?.. గ్రామ గ్రామానా వెలిసిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ కేంద్రాలు, వ్యవసాయ ల్యాబ్ లు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు మీకు కనిపించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ క్రమంలో ఇవేవీ అభివృద్ధికి ఆనవాళ్లు కాదని అనిపిస్తే... మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటో చెబితే తాము, ప్రజలూ తెలుసుకుంటామని రాచమల్లు నిలదీశారు. ప్రాంటీయ పార్టీలకు అధికారం ఇస్తే... స్థానిక సమస్యలు, ప్రజల పరిస్థితి తెలుసు కాబట్టి, అర్ధం చేసుకుని సాయం అందిస్తారని వెల్లడించారు.
ఇక ఎవరో వదిలిన బాణం కాదని షర్మిల అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాచమల్లు... ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమని మీరు అన్నారంటూ గుర్తు చేశారు. అయితే... బాణం అంత పదునైంది కాదుకానీ... బాణం వదిలే వ్యక్తి లక్ష్యం, చూపు ప్రధానమని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... జగనన్న చేతిలో ఉన్నంత సేపే నువ్వు పదునైన బాణానివే అని చురకలంటించిన ఆయన... జగనన్న చేతిలో నుంచి మరొకరి చేతిలోకి వెళ్లిన తర్వాత ఆ బాణానికి పదును తగ్గింది, తగ్గుతుందని సెటైర్లు వేశారు.
ఇదే సమయంలో... వైఎస్సార్ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న వారితో కలిసిన షర్మిలను నేటి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా చూడదల్చుకోలేదని కుండబద్దలు కొట్టిన రాచమల్లు... వైఎస్సార్ రక్తానికి నష్టం తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్. లో చేరి, జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టిన సోనియమ్మ చెంత చేరావని ఆరోపించారు. ఇకపై షర్మిలను వైఎస్సార్ బిడ్డగా కంటే, సోనియమ్మ పెంపుడు కూతురిగా చూస్తామని రాచమల్లు సంచలన కామెంట్లు చేశారు.