ఏపీలో షర్మిల ఫస్ట్ స్టెప్పే రాంగైందా..!
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రజల్లోకి వచ్చారు. త్వరలోనే నియోజకవర్గాల్లో సమీక్షలు కూడా చేయనున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2024 7:30 AM GMTఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రజల్లోకి వచ్చారు. త్వరలోనే నియోజకవర్గాల్లో సమీక్షలు కూడా చేయనున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన సమయమే చాలా కఠినంగా ఉంది. ఎన్నికలకు కేవలం 2 మాసాల ముందు ఆమె బాధ్యతలు చేపట్టారు. ఏమీ లేని జీరో స్థాయి నుంచి పార్టీని డెవలప్ చేయాల్సిన బాధ్యతను భుజాలపై ఎత్తుకున్నారు. దీనికితోడు మహిళా నాయకురాలు.. వైఎస్ తనయ అనే ట్యాగులు ఉండనే ఉన్నాయి. దీంతో ఆమెపై ఆశలు పార్టీకి మెండుగా ఉన్నాయనే చెప్పాలి.
అయితే.. షర్మిల తొలి స్టెప్పులోనే తప్పటడుగు వేశారనే వాదన వినిపిస్తోంది. ఆమె తాజాగా విశాఖప ట్నంలో రోడ్డుపై కూర్చుని ధర్నా చేశారు. రాజకీయాల్లో ఇవి మామూలే అయినా.. వాటి వల్ల పరమార్థం ఉండాలి. కానీ, ఆమె చేసిన ధర్నా.. ఎక్కడో ఈశాన్య రాష్ట్రం అసోంలో పార్టీ అగ్రనేత రాహుల్‌ను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారన్న అజెండాతోనే సాగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆమె విమర్శించారు. నిప్పులు చెరిగారు. అయితే.. దీనివల్ల షర్మిల గ్రాఫ్ పెరగకపోగా..పెదవివిరుపులు కనిపించాయి.
దీనికి కారణం.. షర్మిల ధర్నా చేస్తున్న సమయంలో(సోమవారం) రాష్ట్రంలో ఓ వర్గం మహిళలు రోడ్డెక్కా రు. తమ డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు మధ్య తీవ్ర యుద్ధమే జరిగింది. వారే అంగన్‌వాడీలు. తమ సమస్యల పరిష్కారం కోసం.. సోమవారం తెల్లవారు జాము నుంచి కూడా మహిళలు రోడ్లపైనే ఉన్నారు. చలిలోనూ వారు ధర్నాలు చేశారు. పోలీసులు జట్టు పట్టుకుని లాక్కెళుతున్నా సహించారు.
ఇలాంటి కీలకసమయంలో మహిళలు చేస్తున్న నిరసనలకు, సమ్మెలకు,.. కాంగ్రెస్ ఏపీ చీఫ్‌గా మరీ ముఖ్యంగా ఓ మహిళగా వైఎస్‌షర్మిల వారికి మద్దతు ఇస్తుందని అందరూ ఆశించారు. ముఖ్యంగా అంగన్‌వాడీ మహిళలు ఆమె ప్రకటన కోసం ఎదురు చూశారు. కానీ, ఆమె మహిళలను, రాష్ట్రంలో సమస్యలను వదిలేసి.. ఎక్కడో ఉన్న రాహుల్ కోసం.. రోడ్డెక్కడం చర్చనీయాంశం అయింది. వాస్తవానికి రాష్ట్రంలో పార్టీ పుంజుకోవాలన్నా.. షర్మిల తనను తాను నిరూపించుకోవాలన్నా.. అంగన్ వాడీ సమస్యల వంటి కీలక అంశం కళ్ల ముందు వున్నప్పుడు.. ఆమె ఎందుకు వదిలేశారు? అనేది చర్చగా మారింది.
మహిళలను ఆకట్టుకునేందుకు.. అంగన్ వాడీ వారితో కలిసి ఆమె కూడా రోడ్డెక్కి ఉంటే.. ఆమెకు ఫస్ట్ స్టెప్పులోనే ఇమేజ్ పెరిగిపోయి ఉండేదని అంటున్నారు పరిశీలకులు. కానీ, ఆమె తొలి అడుగే.. రాహుల్ కోసం వేయడంతో రాష్ట్రసమస్యలపై ఆమె వ్యవహరించిన తీరును సర్వత్రా తప్పుపడుతున్నారు.