కాంగ్రెస్ కు శశిథరూర్ గుడ్ బై చెప్పబోతున్నాడా?
త్వరలోనే ఆయన పార్టీని వీడవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
By: Tupaki Desk | 24 Feb 2025 12:30 PM GMTకాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశి థరూర్ తన రాజకీయ జీవితంలో కీలక మలుపు వద్ద ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. జరిగే పరిణామాలు, ఆయన కాంగ్రెస్ పార్టీలో స్థానం బలహీనమవుతున్నాయనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. త్వరలోనే ఆయన పార్టీని వీడవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మలయాళ భాషా పాడ్‌కాస్ట్ ‘వర్తమానం’ టీజర్‌లో థరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "పార్టీ నన్ను కోరుకుంటే నేను అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు స్వంత పనులు ఉన్నాయి. మీరు నన్ను పార్టీకి మాత్రమే పరిమితం చేయలేరు. నాకు నా పుస్తకాలు, ప్రసంగాలు, ప్రపంచవ్యాప్తంగా చర్చల కోసం ఆహ్వానాలు ఉన్నాయి," అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకే ఒక అల్టిమేటంగా భావిస్తున్నారు.
అంతేకాకుండా, కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం కూడా సంచలనంగా మారింది. కేరళలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) , లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF) కావడంతో థరూర్ లెఫ్ట్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయన ప్రశంసలను స్వాగతించింది. ఇది ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై మరింత ఊహాగానాలకు తావిస్తోంది.
థరూర్ స్వతంత్రమైన విధానాన్ని అనుసరించడం ఇది తొలిసారి కాదు... ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశాన్ని ఆయన ప్రశంసించడం కాంగ్రెస్ వర్గాల్లో విమర్శలకు కారణమైంది. ఈ సంఘటనలు ఆయన పార్టీ లైన్‌కు భిన్నంగా తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంపై కూడా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. 2024 జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంతవరకు పుంజుకున్నా, అనుబంధ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ప్రదర్శన చూపింది. కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో మూడోసారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. "కేవలం కాంగ్రెస్ మద్దతుదారులపై ఆధారపడటం సరిపోదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు 19% ఓటు షేర్ ఉంది. అధికారంలోకి రావాలంటే కనీసం 25-27% ఓటు షేర్ అవసరం" అని ఆయన పేర్కొన్నారు.
థరూర్ స్వతంత్ర అభిప్రాయాలు.. విస్తృత ప్రజాదరణ ఆయనను కేవలం కాంగ్రెస్ పార్టీ గడపలకే పరిమితం చేయలేని నేతగా మలిచాయి. ఆయన వ్యాఖ్యలు , చర్యలు, పార్టీ గడపల్ని దాటి మరింత ప్రజాదరణ పొందే విధంగా ఉన్నాయి.
ఈ మెలికల నేపథ్యంలో థరూర్ కాంగ్రెస్‌తో కొనసాగుతారా? లేదా కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది. కానీ ఆయన తాజా వ్యాఖ్యలు, రాజకీయ రంగంలో పెను మార్పులకు దారి తీసే అవకాశం కల్పిస్తున్నాయి.