Begin typing your search above and press return to search.

బీసీసీఐ పై శశిథరూర్ కి పీకలదాకా ఉందా?

అవును... శనివారం జరిగిన మ్యాచ్ లో టీంఇండియా.. జింబాబ్వే చేతిలో ఓటమి పాలవ్వడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 6:27 AM GMT
బీసీసీఐ పై శశిథరూర్  కి పీకలదాకా ఉందా?
X

టీ20 వరల్డ్ కప్ సాధించిన తాలూకు సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్న సమయంలో... జింబాబ్వే పర్యటనను యువ భారత్ అనూహ్య పరాజయంతో ఆరంభించింది. అయిదు టీ20ల సిరీస్‌ లో భాగంగా శనివారం సాగిన తొలి మ్యాచ్‌ లో శుభ్‌ మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బౌలర్లు రాణించినప్పటికీ.. బ్యాటర్లు చేతులెత్తేశారు.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు.

ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు బ్యాటర్స్ ని స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌ (4-2-13-4), వాషింగ్టన్‌ సుందర్‌ (4-0-11-2) ఓ ఆటాడుకున్నారు. ఫలితంగా జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. జింబాబ్వే తరుపున మడాండే (29 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. అయితే అనూహ్యంగా జింబాబ్వే బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.

ఇందులో భాగంగా జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా (3/24), చటార (3/16)ల ధాటికి టీం ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. భారత బ్యాటర్స్ లో శుభ్ మన్ గిల్ (31), వాషింగ్టన్‌ సుందర్‌ (27) మినహా మిగిలిన బ్యాటర్లంతా తేలిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ఈయన స్పందన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

అవును... శనివారం జరిగిన మ్యాచ్ లో టీంఇండియా.. జింబాబ్వే చేతిలో ఓటమి పాలవ్వడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఇందులో భాగంగా... జింబాబ్వే చ్చేతిలో భారత్ ఓటమిపై ఆయన హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. భారత్ గర్వాన్ని జింబాబ్వే దించిందన్నట్లుగా ఆయన ట్వీట్ చేశారు!

టీ20 ప్రపంచ కప్ సంబురాలు ఇంకా ఆగకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఓటమి పాలయ్యాం.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే బీసీసీఐ కు ఇలా జరగాల్సిందే అని ట్వీట్ చేసిన శశిథరూర్... బాగా ఆడారంటూ జింబాబ్వే జట్టును ప్రశంసించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. శశిథరూర్ పై టీంఇండియా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.