Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు కొత్త టెన్షన్... స్మగ్లింగ్ లో దొరికిన ఎంపీ పీఏ!

అయితే... నిందితుల్లో ఒకరు ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు కావడంతో వ్యవహారం వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   30 May 2024 2:10 PM GMT
కాంగ్రెస్  కు కొత్త టెన్షన్... స్మగ్లింగ్  లో దొరికిన ఎంపీ పీఏ!
X

భారతదేశంలోని విమానాశ్రయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ కి సంబంధించిన వార్తలు నిత్యం ఏదో ఒక మూల తెరపైకి వస్తూనే ఉంటాయి! ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే... నిందితుల్లో ఒకరు ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు కావడంతో వ్యవహారం వైరల్ గా మారింది.

అవును... కేరళ రాజకీయాల్లో మరోసారి బంగారం స్మగ్లింగ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో... తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ ఢిల్లీలోని కస్టమ్స్‌ అధికారులకు చిక్కడం కలకలం రేపుతోంది!

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారట. దీంతో... కస్టమ్స్‌ అధికారులు వారిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం వారిని తనిఖీలు చేయగా వారి వద్ద 500 గ్రాములకు పైగా బరువున్న బంగారపు గొలుసును గుర్తించారు. దాని విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ సమయంలో ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వారిని అరెస్టు చేశారు. అయితే... ఆ ఇద్దరు నిందితుల్లో ఒకరు ఎంపీ శశిథరూర్‌ సహాయకుడు శివ కుమార్‌ ప్రసాద్‌ అని అధికారులు తెలిపారు. దీంతో.. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

థరూర్ రియాక్షన్ ఇదే!:

తాజా పరిణామాలపై శశిథరూర్‌ "ఎక్స్‌" వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ఎన్నికల ప్రచారం నిమిత్తం ధర్మశాలలో ఉండగా ఈ విషయం తెలిసి షాకయ్యినట్లు తెలిపారు. అయితే... అతడు గతంలో తన దగ్గర పనిచేశాడని, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న ఆ 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడని.. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో పార్ట్‌ టైం కింద మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు.

అయితే... ఇలాంటి తప్పులను మాత్రం క్షమించేది లేదని.. ఈ కేసు దర్యాప్తు కోసం అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని థరూర్‌ ఎక్స్ లో రాసుకొచ్చారు.

కాగా... 2020లో దుబాయ్‌ నుంచి తిరువనంతపురం వచ్చిన యూఏఈ దౌత్యకార్యాలయ సిబ్బంది బ్యాగుల్లో సుమారు 30 కిలోల బంగారం బయటపడిన సంగతి తెలిసిందే. ఆ బ్యాగును కేరళ సీఎం పనరయి విజయన్‌ స్వయంగా నిర్వహించే ఐటీశాఖలో ఓ ప్రాజెక్టులో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ గా పనిచేసిన స్వప్నా సురేశ్‌ తెప్పించినట్లు తేలింది!