Begin typing your search above and press return to search.

తెలంగాణలో 700 కోట్ల స్కాం... ఈడీ అడిగిన వివరాలివే!?

అవును... తెలంగాణలో గత బీఆరెస్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2024 7:45 AM GMT
తెలంగాణలో 700 కోట్ల స్కాం... ఈడీ అడిగిన వివరాలివే!?
X

ప్రస్తుతం తెలంగాణలో ఓ 700 కోట్ల రూపాయల స్కాం వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకం ఏమిటి.. ఇందులో స్కాం ఎలా జరిగింది.. ఆ స్కాంలోని సూత్రదారులు, పాత్రదారులు ఎవరు.. ఈ కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫెన్స్ ఏ స్థాయిలో ఉండబోతుంది అనే అంశాలపై తీవ్ర చర్చ మొదలైంది.

అవును... తెలంగాణలో గత బీఆరెస్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గురించిందని చెబుతున్నారు. దీంతో గతకొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంపై విచారణచేపట్టారని అంటున్నారు.

అయితే ఈ విచారణలో సుమారు 700 కోట్ల రూపాయల మేర మనీ ల్యాండరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారట. దీంతో వెంటనే కేసును ఈడీకి అప్పగించాలని నిర్ణయించడం.. ఈ మేరకు ఈడీ జోనల్ కార్యాలయం అధికారికి లేఖ రాయడం జరిగిపోయిందని అంటున్నారు. దీంతో... ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... గొర్రెల కొనుగోళ్ల కోసం ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమచేశారో ఆ వివరాలు, ఆయా బ్యాంక్ ఖాతాల సమాచరంతో పాటు గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దీనికోసం ఎవరిని నిధులిచ్చారనే వివరాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో ఈ వ్యవహారంలో సుమారు 10 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని అంటున్నారు. ఇదే సమయంలో ఈ స్కాంలో ఇద్దరు మంత్రులు కీలకంగా వ్యవహరించారని తెలుస్తుందని సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు బీఆరెస్స్ లో తీవ్ర కలకలం రేపిందని అంటున్నారు. కాకపోతే ఆ పార్టీ నుంచి ఎవరూ ఈ విషయంపై బహిరంగంగా స్పందించినట్లు కనిపించకపోవడం గమనార్హం.

కాగా బీఆరెస్స్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత... గ్రామాల్లోని పశుపాలకులకు గొర్రెలను ఉచితంగా పంపిణీ చేయాలని కేసీఆర్ భావించిన సంగతి తెలిసిందే. దీంతో గొర్రెల ఉచిత పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం ఏపీ, మహారాష్ట్ర సహా నాలుగైదు రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగోలు చేసి, తెలంగాణలోని పలు జిల్లాల్లో పంపిణీ చేశారు.

అయితే ఈ క్రమంలోనే భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో గత ఏడాది కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు అదేశించింది! దీంతో... ఈ పథకం అమలులో సుమారు రు.700 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా గురించారని అంటున్నారు.