Begin typing your search above and press return to search.

గొర్రెల పథకం స్కాంలో సీఈవో అరెస్టు వేళ హైడ్రామా

ఒక అవినీతి ఉదంతం వెలుగు చూసిన తర్వాత.. సీన్లోకి వచ్చే అధికారులను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయరు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 5:03 AM GMT
గొర్రెల పథకం స్కాంలో సీఈవో అరెస్టు వేళ హైడ్రామా
X

ఒక అవినీతి ఉదంతం వెలుగు చూసిన తర్వాత.. సీన్లోకి వచ్చే అధికారులను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయరు. ఒకవేళ.. వారు ఏసీబీ.. సీబీఐ.. లాంటి విచారణ సంస్థలకు చెందిన వారైతే.. మరింత జాగ్రత్తగా ఉంటారు. అందుకు భిన్నంగా తాజాగా వెలుగు చూసిన గొర్రెల పథకం కుంభకోణంలో చోటు చేసుకున్న కుంభకోణం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. ఈ స్కాం దాదాపు రూ.700 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ పథకం మీద వచ్చిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు నిర్వహించగా.. భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

గొర్రెల పథకంపై ఫోకస్ చేసిన ఏసీబీ దర్యాప్తు నివేదిక ప్రకారం దాదాపు రూ.700 కోట్ల ఉండటం.. దీనికి పశుగణాభివ్రద్ధి సంస్థ సీఈవో రాంచందర్ నాయక్.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్ కుమార్ లను తాజాగా ఏసీబీ అరెస్టు చేసింది. ఈ ఇద్దరినీ విచారించిన అనంతరం భారీ మొత్తంలో కుంభకోణం జరిగిందని తేల్చారు. దీంతో.. శుక్రవారం వారిని అరెస్టు చేశారు.

అయితే.. ఈ అరెస్టు వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ అధికారులకే షాకిచ్చేలా కొందరు అడ్డుకున్నారు. నిధుల దుర్వినియోగం మీద రాంచందర్ పాత్ర ఉందన్నవిషయాన్ని గుర్తించిన ఏసీబీ.. ఆయన్ను అరరెస్టు చేసేందుకు మాసబ్ ట్యాంక్ లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఏసీబీ అధికారులు రాంచందర్ ను కలిసి.. విచారణ కోసం తమ వెంట రావాలని కోరారు.

అందుకు ఆయన నో చెప్పారు. ఏసీబీ అధికారుల వెంట వచ్చేందుకు ససేమిరా అన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి చాలా తక్కువసార్లు మాత్రమే చోటు చేసుకుంటుంది. దీంతో.. ఏసీబీ అధికారులు తమ తీరును మార్చి.. తమ వెంట రావాలంటూ కాస్తంత కఠినంగా చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన మొండికేయటంతో ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా కొందరు ఆయన్ను అదుపులోకి తీసుకోవటాన్ని తప్పుపడుతూ.. ఏసీబీ అధికారులకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. దీంతో.. వారు తీవ్రంగా రియాక్టు అవుతూ.. హెచ్చరికలు జారీ చేయటంతో కాస్తంత వెనక్కి తగ్గారు. అనంతరం రాంచందర్ ను అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్న వాదన వినిపిస్తోంది. తాజా అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.