ప్రధాని కీలక నిర్ణయం... ఎయిర్ లైన్స్ సహా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ!
గతకొంతకాలంలో భారత్ లో పలు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ కాబోతున్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 15 May 2024 5:03 PM GMTగతకొంతకాలంలో భారత్ లో పలు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ కాబోతున్నాయంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హైవేలు కూడా ఉన్నాయనే చర్చా అప్పట్లో తెరపైకి వచ్చింది. ఇక ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన సంగతి తెలిసిందే. ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఆంధ్రులు మొత్తుకుంటున్నారు.. అయినప్పటికీ హస్తిన పెద్దలు వినిపించుకోవడం లేదని అంటున్నారు.
భారత్ లో సంగతి అలా ఉంటే... పక్కనున్న పాకిస్థాన్ లో పరిస్థితి తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టడుతుందని అంటున్నారు. ఈ సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తో పాటు ప్రభుత్వ రంగంలోని దాదాపు అన్ని సంస్థలను ప్రైవేట్ పరం చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.
అవును... దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలని పాకిస్థాన్ లో కొత్తగా కొలువైన ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా... కొన్ని కీలక, వ్యూహాత్మక రంగ సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చి.. మిగిలిన అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకుంది! దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఇంతకు మించి మరో ఆప్షన్ లేదన్నట్లుగా పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
వాస్తవానికి గత కొంతకాలంగా పాకిస్థాన్ అటు రాజకీయ, ఇటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఇటీవల కాస్త రాజకీయ సంక్షోభం నుంచి గట్టిక్కినట్లు చెబుతున్న సర్కార్... ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో... అన్ని మంత్రిత్వ శాఖలు ప్రైవేటీకరణ కమిషన్ కు సహకరించాలని ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఆదేశించారు.