Begin typing your search above and press return to search.

బంగ్లాకు హసీనాను భారత్ అప్పగిస్తుందా ?

షేక్ హసీనా ఇపుడు భారత్ లో శరణార్ధి. ఆమె వేరే దేశం కూడా పోకుండా ఆమె పాస్ పోర్టుల మీద ఆంక్షలు పెట్టింది బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   1 Sep 2024 4:13 AM GMT
బంగ్లాకు హసీనాను భారత్ అప్పగిస్తుందా ?
X

షేక్ హసీనా ఇపుడు భారత్ లో శరణార్ధి. ఆమె వేరే దేశం కూడా పోకుండా ఆమె పాస్ పోర్టుల మీద ఆంక్షలు పెట్టింది బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం. దాంతో ఆమె గత కొంత కాలంగా భారత్ లోనే గడపాల్సి వస్తోంది. ఆమె ఎన్నాళ్లు ఉంటారు అన్నది తెలియదు. అయితే షేక్ హసీనా తలరాత ఇంతలా తిరగ బడడానికి కారణం ఆమెకు కూడా అర్థం కాదేమో.

ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేస్తే ఆ కార్యక్రమానికి అధికారికంగా ఒక గౌరవ అతిధిగా వచ్చిన హసీనా అతి కొద్ది సమయంలోనే బంగ్లా నుంచి పారిపోయి ప్రాణాలు చిక్కబట్టుకుని రావడం అంటే విధి రాత ఎంతటితో అర్ధం అవుతుంది. ఆమె బంగ్లాను పదిహేనేళ్ళ పాటు నిరాటంకంగా పాలించారు. అంతకు ముందు ఒక అయిదేళ్లు కలుపుకుంటే ఎక్కువ కాలం ఆ దేశాన్ని ఏలిన ఉక్కు మహిళగా ఉన్నారు.

అటువంటిది ఆమె గత నెలలో బంగ్లా అల్లర్ల నేపధ్యంలో తన పదవికి రాజీనామా చేసి హుటాహుటిన రావాల్సి వచ్చింది. ఇక ఆమె ప్రభుత్వం మీద ప్రజాగ్రహం ఒక వైపు ఉంటే మరో వైపు ఆమె నిర్ణయాల మీద దర్యాప్తు చేసి ఆమెను ఆమె పార్టీని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని వెనక నుంది ఆడిస్తున్న సైన్యం ఆలోచిస్తోంది అని అంటున్నారు.

అందుకే తాజాగా బంగ్లా విదేశాంగ వ్యవహారాల సలహాదారు తోహిద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లా దేశ హోం న్యాయ శాఖల నుంచి ఏదైనా అభ్యర్ధన వస్తే కనుక తిరిగి తమ దేశానికి హసీనాను అప్పగించమని కోరుతామని అన్నారు. దీనిని భారత్ కట్టుబడి ఉండాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు. అదే పరిస్థితి కనుక వస్తే భారత్ కి ఇబ్బందికరం అవుతుందని కూడా వ్యాఖ్యానించారు.

ఆయన మాటలలోని సారాంశం కనుక చూసుకుంటే హసీనను అప్పగించాలని తొందరలోనే బంగ్లా దేశం కోరవచ్చు అన్న సంకేతాలు అయితే ఉన్నాయి. మరి భారత్ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి. హసీనా వెళ్లేందుకు ఓకే అంటే నో ప్రాబ్లం. ఆమె కాదు అంటే మాత్రం భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించిన దేశంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. అది బంగ్లాకు ఇష్టమో కష్టమో కూడా అపుడే తేలుతుంది.

ఇక షేక్ హసీనా భారత్ కి అత్యంత సన్నిహితురాలు. ఆమె తండ్రి ముజిబుర్ రెహ్మాన్ బంగ్లా జాతి పిత. ఆయన బంగ్లా కోసం ఎంతో పోరాటం చేశారు. ఆయనకు నాడు భారత్ మద్దతుగా నిలిచింది. ఆయన కుమార్తె సైతం భారత్ పట్ల అలాంటి వైఖరినే అనుసరించింది. అది గిట్టని దేశాల సాయం సైన్యం హస్తంతోనే షేక్ హసీనా పదవీచ్యుతులు అయ్యారని కూడా అంటున్నారు.

ఈ నేపధ్యంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి. ఇటీవల తాత్కాలిక ప్రభుత్వ అధినేత భారత ప్రధాని మోడీతో ఫోన్ సంభాషణలు జరిపారు. ఇరు దేశాల మధ్య మంచి వాతావరణం కోరుకున్నారు. అయితే బంగ్లా భారత్ పట్ల అనుసరించే వైఖరిని బట్టే భారత్ వైఖరి ఉంటుందని విదేశాంగ మంత్రి జై శంకర్ అంటున్నారు. చూడాలి మరి.