ఎకరా భూమి రూ.1700.. కొనేసి కుమార్తెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం ప్రశాంతనగర్‌కు చెందిన షేక్ ఆసిఫ్ చందమామపై భూమిని కొనుగోలు చేశారు
By: Tupaki Desk | 18 Sep 2023 5:55 AM GMTఎకరా భూమి.. కోట్లకు కోట్ల రూపాయలు పలుకుతున్న ఈ కలికాలంలో కేవలం రూ.1700 అంటే.. మాటలా!? ఉరుకులు పరుగులు పెట్టి మరీ కొనేసేందుకు ప్రజలు ఎగబడరా? మరి అలాంటి భూమి ఎక్కడుంది? ఎవరు అమ్ముతున్నారు? అని ముఖం చిట్లిస్తున్నారా?! ఎకరా భూమి రూ.1700లకు విక్రయించే స్థలం చందమామపై ఉంది. నెలరాజుపై నేల ఖరీదు ఇప్పుడు వందల్లోనే పలుకుతోంది. ఔను.. ఇది ముమ్మాటికీ నిజం. అంతేకాదు.. ఈ భూమిని మన పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు.
అంతేకాదు.. నెలరేడుపై కొన్న నేలకు అంతర్జాతీయంగా కూడా మనకు హక్కులు లభిస్తాయి. ఎవరూ కూడా మన భూమిని కబ్జా చేసే అవకాశం కానీ.. ఆక్రమించుకునే ఛాన్స్ కానీ లేదు. అయితే.. మనం అక్కడకు చేరుకునే పరిస్థితి ఇప్పట్లో లేదు. కానీ, స్టాక్ మార్కెట్‌లో మాదిరిగా ఇప్పుడు నెలరాజుపై నేలను కొనేసి.. భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్న వారు పెరుగుతున్నారు. అంతేకాదు.. తమ వారసులకు కానుకలుగా కూడా ఇస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది.
ఎవరు.. ఏం జరిగింది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణం ప్రశాంతనగర్‌కు చెందిన షేక్ ఆసిఫ్ చందమామపై భూమిని కొనుగోలు చేశారు. ఈయన వృత్తి రీత్యా బెంగళూరులోని ప్రైవేటు బ్యాంకులో క్లస్టర్ మేనేజర్. గతేడాది నవంబరులో ఆయనకు కుమార్తె(మైషా) పుట్టింది. మైషాకు త్వరలోనే ఏడాది పూర్తికానుంది. ఈ నేపథ్యంలో పుట్టినరోజు కానుకగా చంద్రుడిపై భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలనుకున్నారు.
అమెరికాకు చెందిన లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ చంద్రుడిపై భూమిని విక్రయిస్తోందని తెలిసి వారిని సంప్రదించారు. చంద్రునిపై ఒక ఎకరా భూమి కొనుగోలుకు దరఖాస్తు చేసుకోగా.. ఆ సంస్థ బే ఆఫ్ రెయిన్‌బోస్ ప్రాంతంలో ఎకరా రూ.1700లకు విక్రయించింది. అంతేకాదు.. రిజిస్ట్రేషన్, ఫిజికల్ డాక్యుమెంట్స్, కొరియర్ చార్జీలు కలిపి మొత్తం రూ.11,600 వసూలు చేసింది. దీన్ని గత నెల ఆగస్టు 28న రిజిస్టర్ చేసి, అంతర్జాతీయ హక్కులు కూడా కల్పించారు. అంటే.. ఈ ఎకరా భూమి మైషాదేనన్నమాట. ఇదీ.. సంగతి!! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కొనేయండి!!