బంగ్లా "ఉక్కు మహిళ" జీవితాన్ని మార్చేసిన ఆ 45 నిమిషాలు!!
అవును.. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Aug 2024 11:10 AM GMTఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన బంగ్లాదేశ్ కు స్థిరత్వం తీసుకొచ్చిన చరిత్ర ఆమె సొంతం.. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించిన పాలనా దక్షత ఆమె సొంతం.. తన మద్దతుదారులతోనే కాకుండా మెజారిటీ బంగ్లా ప్రజలతో "ఉక్కు మహిళ" గా ప్రశంసలు అందుకున్న నైపుణ్యం ఆమె సొంతం. అయితే సోమవారం ఆమెకు 45 నిమిషాల సమయం మాత్రమే దక్కింది.
అవును.. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ తీవ్రత కాస్తా ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది. ఈ మేరకు ఆమెకు సైన్యం అల్టిమేటం జారీ చేసింది. ఏ సైనిక పాలన నుంచి బంగ్లా ప్రజలకు విముక్తి కలిగించిందో.. ఆమెకే సైన్యం 45 నిమిషాల సమయం ఇచ్చింది!
ఆమె అలా ప్రధాని అధికార నివాసం గణభవన్ ను ఖాళీ చేశారో లేదో... ఆ భవనంలోకి వందల మంది అందోళనకారులు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆ భవనంలోని దుస్తులు, కిచెన్ లోని చేపలు, హాల్లోని ఫర్నిచర్.. ఎవరికి నచ్చింది వారు ఎత్తుకుని పోయిన పరిస్థితి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ నేపథ్యంలో బంగ్లా నుంచి నేరుగా హెలీకాప్టర్ లో బయలుదేరిన హసీనా.. భారత్ కు చేరుకున్నారు. ఇక్కడ ఆమెకు గౌరవప్రదమైన రిసీవింగ్ దక్కింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు మొదలుపెట్టారు. దీంతో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే... దీని నియంత్రణ మాత్రం సైన్యం చేతుల్లో ఉంటుంది.
సోమవారం పరిస్థితి చేజారిపోవడంతో... బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్... షేక్ హసీనాకు అల్టిమెంట్ జారీ చేశారు. ఇందులో భాగంగా 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్లాలని సమయం కేటాయించారు. అయితే... ఆమెకు మరికాస్త సమయం ఉంటే దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, ఆ తర్వాత పయనమవ్వాలనుకున్నారని అంటున్నారు. కానీ ఆమెకు సైన్యం అంత సమయం ఇవ్వకపోవడం గమనార్హం.
దీంతో... దేశ ప్రజలకు తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పడానికి సమయం లేకపోవడంతో... సైన్యం నుంచి నోటీసు అందుకున్న తర్వాత హుటాహుటిన షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా... ఆమె తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కు సమర్పించి.. బంగ్లా విడిచి భారత్ కు ప్రయాణమై వచ్చారు.
ఇలా సైన్యం తనకు ఇచ్చిన 45 నిమిషాల్లోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రవాణా విమానం సీ-130లో భారత్ బయలుదేరారు. ఈ సమయంలో ఆమె బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానం భారత్ లోకి ప్రవేసించడానికి ఇండియన్ ఎయిర్ పోర్స్ అన్ని అనుమతులు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం రూ.5:36 గంటలకు యూపీలోని హిండన్ ఎయిర్ బేస్ లో దిగింది.
ఈ నేపథ్యంలో ఆమె ఎయిర్ బేస్ సేఫ్ హౌస్ లో ఎంతకాలం ఉంటారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి వెళ్తారా... లేక, ఈ లోపు లండన్ నుంచి అనుమతి వస్తే అటు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా... ఆమె ఏ దేశంలో రాజకీయ ఆశ్రయం పొందుతారనేది మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతానికి భారత్ లో క్షేమంగా ఉన్నారు!!