Begin typing your search above and press return to search.

బంగ్లాలో సంచలనం.. ప్రధాని రాజీనామా.. హెలికాప్టర్ లో పరార్.. సైనిక పాలన

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వివాదం ఇక్కడవరకు తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 10:20 AM GMT
బంగ్లాలో సంచలనం.. ప్రధాని రాజీనామా.. హెలికాప్టర్ లో పరార్.. సైనిక పాలన
X

రోడ్లపైకి లక్షల మంది జనం.. వందలాది ప్రాణాలు బలి.. వేలాదిగా ఆస్తుల నష్టం.. బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న సంక్షోభం ఇది. తగ్గినట్లే తగ్గిన ఆందోళనలు ఆదివారం మరింత పెట్రేగాయి.. ప్రధాని రాజీనామా చేయాలంటూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. వారికి, బంగ్లాదేశ్ అధికార పార్టీ కార్యకర్తలకు జరిగిన ఘర్షణల్ల 100 మందిపైగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దీంతో హింసాత్మక ఘటనలు చెలరేగి.. దేశం అట్టుడుకింది. ఆదివారం, అంతకుముందు జరిగిన ఘర్షణల్లో మొత్తం 300 మంది చనిపోయారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఢాకా ప్యాలెస్‌ ను వీడిన ప్రధానమంత్రి షేక్‌ హసీనా.. సురక్షిత ప్రాంతానికి హెలికాప్టర్ లో వెళ్లిపోయారు. ఆందోళనల ఉద్ధృతి రీత్యా ఆమె పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.

రిజర్వేషన్ల చిచ్చు..

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వివాదం ఇక్కడవరకు తీసుకొచ్చింది. గత నెలలో అల్లర్లను అదుపుచేయడంలో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం విఫలమైంది. మళ్లీ ఇంతలోనే వివాదం రేగి వందల ప్రాణాలు పోయాయి. అసలు ఏమిటీ రిజర్వేషన్లు అని చూస్తే.. బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం 1970ల మొదట్లో ఉద్యమం జరిగింది. భారత్ చొరవతో 1971లో వారికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ ఉద్యమంలో పాల్గొన్నవారికి 30 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు షేక్ హసీనా ప్రభుత్వం ప్రయత్నాలు చేయగా సుప్రీం కోర్టు అడ్డుకుంది. అయితే, మధ్యలోనే ఇది యువతకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అసలే ఉద్యోగాలు లేని తమకు రిజర్వేషన్లు మరింత దెబ్బ అని భావించిన వారు వీధుల్లోకి వచ్చారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో సుప్రీం కోర్టు రిజర్వేషన్లను 5 శాతానికి తగ్గించాలని సూచించింది. 93 శాతం ప్రతిభ, 2 శాతం మైనారిటీలు, దివ్యాంగుల రిజర్వేషన్లు కేటాయించాలని పేర్కొంది. అయితే, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్. అల్లర్లలొ భారీగా జనం చనిపోయారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిచ్చినా వెనక్కి తగ్గలేదు. పోలీసు కాల్పుల్లోనే వందలమంది చనిపోయారు. దీంతో ప్రజాగ్రహం మరింత పెరిగింది. సుప్రీం తీర్పు తర్వాత కూడా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గలేదు. ఆదివారం ఢాకాలోని ఆర్బీబీ(రిజ‌ర్వ్ బ్యాండ్ ఆఫ్ బంగ్లాదేశ్‌)కు ఆందోళ‌న కారులు నిప్పు పెట్టారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ధ్వంసం చేశారు. షాపింగ్ మాళ్ల‌ను, ప్రైవేటు ఆస్తుల‌ను కూడా త‌గుల పెట్టారు. క‌ర్ఫ్యూ విధించినా.. విద్యార్థులు లెక్క‌చేయ‌కుండా దూసుకువస్తున్నారు.

ప్రధాని ఇంటి ముట్టడి.. హసీనా పరార్

సోమవారం ప్రధాని హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించి అందిన కాడికి దోచుకున్నారు. దీన్ని పసిగట్టిన హసీనా అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆమె హెలికాప్టర్ లో పిన్లాండ్ కు భారత్ లోని పశ్చిమ బెంగాల్ కు వెళ్లారన్న కథనాలు వస్తున్నాయి. కాగా, ఆందోళనకారులను అణచివేయాలన్న హసీనా కుమారుడి ఆదేశాలను సైన్యం పట్టించుకోవడం లేదు.

సైనిక పాలన...?

సోమవారం రాత్రి 8 గంటలకు బంగ్లాదేశ్ ఆర్మీ ఛీఫ్ వాకర్ ఉజ్ జమాన్ జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. దేశ భవిష్యత్తుపై ఆయన స్పష్టత ఇవ్వనున్నారు. పాకిస్థాన్ లో జరిగిన తరహాలోనే దేశ పాలనను చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా,బంగ్లా పరిణామాలతో భారత్ అలర్ట్ అయింది. ఆ దేశంతో 4096 కి.మీ. సుదీర్ఘ సరిహద్దు ఉన్నందున అప్రమత్తమైంది. బీఎస్ఎఫ్ పహారాను పటిష్టం చేసింది.

ఎవరీ హసీనా?

బంగ్లాదేశ్ ప్రధాని హసీనా.. ఆ దేశ జాతిపిత ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె. భారత్ కు బలమైన మద్దతుదారు. 2009 నుంచి ప్రధానిగా ఉన్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న మహిళ ఈమెనే. కాగా, ఈ ఏడాది ప్రారంభంలోనే హసీనా బంగ్లా ప్రధానిగా నాలుగోసారి రికార్డు మెజారిటీతో ఎన్నికయ్యారు. మరో కీలక నాయకురాలు, భారత వ్యతిరేకి ఖలీదా జియాకు చెందిన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీపై ఘన విజయం సాధించారు. ఖలీదా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.