45 నిమిషాలు.. అరచేతిలో ప్రాణాలు.. కట్టుబట్టలతో బయటకు.. హసీనా దీనావస్థ
ఓవైపు ఆందోళనకారులు దూసుకొస్తున్నారు.. మరోవైపు సైన్యం సమయం ఇవ్వలేదు.. కాసేపు ఆగితే ఏం జరుగుతుందో తెలియదు
By: Tupaki Desk | 8 Aug 2024 8:38 AM GMTఓవైపు ఆందోళనకారులు దూసుకొస్తున్నారు.. మరోవైపు సైన్యం సమయం ఇవ్వలేదు.. కాసేపు ఆగితే ఏం జరుగుతుందో తెలియదు.. ఇంకాస్త సమయం వేచి చూసి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడదాం అంటే.. అసలు ఆ దేశమే ఆగ్రహంతో ఊగిపోతోంది... మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఏం చేశారో తెలుసా..?
ఉన్నపళంగా ప్రయాణం
బంగ్లాదేశ్ లో గత నెలలోనే తీవ్ర స్థాయి ఆందోళనలు జరిగాయి. అప్పుడే 300 మంది వరకు చనిపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ల ఉద్యమం చల్లారినట్లే చల్లారి ఈ నెల మొదట్లో ఊపందుకుంది. సోమవారం నాటికి అది మహోగ్ర జ్వాలగా మారింది. ప్రధాని అధికారిక నివాసం వైపు ప్రజలు దూసుకురావడం.. దాడులకు దిగడం అంతా చకచకా జరిగిపోతోంది. దీంతో అప్పటివరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ (త్రివిధ దళాలు) అధిపతులతో సమావేశమయ్యారు. ఏదైనా చేయమని కోరారు. అయితే, పరిస్థితి చేయిదాటిపోయిందని వారు స్పష్టం చేశారు. జాతినుద్దేశించి ప్రసంగిస్తానని కోరినా వినలేదు. కేవలం 45 నిమిషాలే టైం ఇచ్చారు. దేశాన్ని వీడడమే మార్గం అన్నట్లు సూచించారు. విదేశాల్లో ఉన్న హసీనా కుమారుడూ ఇదే చెప్పడం ఆమెకు మరో మార్గం లేకపోయింది. చెల్లెలు షేక్ రెహానాతో కలిసి హెలికాప్టర్ లో అధ్యక్ష భవనానికి వెళ్లి రాజీనామా సమర్పించి.. అటునుంచి అటే సైనిక విమానంలో బయల్దేరి భారత్ కు వచ్చేశారు. ఆ కాస్త సమయంలో భారత్ ను అనుమతి కోరడం, హసీనా విమానం భారత్ గగనతలంలోకి అడుగుపెట్టిన వెంటనే అత్యంత అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు తోడు రావడం ఆమె ఢిల్లీ వరకు చేరుకోవడం అంతా చకచకా జరిగిపోయింది. ఈలోగా ఆందోళనకారులు బంగ్లాదేశ్ లో కనీవినీ ఎరుగని విధ్వంసం రేపారు.
సహాయకులతో ఉత్త చేతులతో..
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుడి కుమార్తె అయి ఉండి, 15 ఏళ్లు ఏకధాటిగా, అంతకుముందు దాదాపు ఐదేళ్లు ప్రధానిగా పనిచేసి, ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్న మహిళా నాయకురాలిగా పేరుగాంచిన షేక్ హసీనా.. భారత్ లోకి కట్టుబట్టలతో రావడం విధి వైచిత్రి అనుకోవాలి. ఈ క్రమంలో ఆమెతో ఉన్న కొందరు అధికారులు, సహాయకులదీ ఇదే పరిస్థితి. ఆందోళనకారులు అధికారిక నివాసం వైపు దూసుకొస్తుండటంతో చేసేదేమీ లేకపోయింది. ఎంతటి దుస్థితి అంటే.. కనీసం దుస్తుల వంటి వ్యక్తిగత వస్తువులూ తెచ్చుకునే పరిస్థితి లేకపోయిందట. ప్రాణాలు దక్కితే అదే పదివేలని భావించి.. హసీనా, ఆమెతో ఉన్నవారు సీ-130 జే విమానంలో దేశం వీడారు. భారత్ వచ్చాక ప్రొటోకాల్ అధికారులు నిత్యావసర వస్తువుల కొనిచ్చినట్లు సమాచారం.
షాక్ లో హసీనా..
బంగ్లాదేశ్ కోసం ఎంతో చేసిన హసీనా జరిగిన పరిణామాల పట్ల షాక్ తో ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఆమె తేరుకున్నాక మాట్లాడతామన్నారు. కాగా, హసీనా, ఆమె చెల్లెలు రెహానా, పదుల సంఖ్యలో సహాయకులు భారత్ వచ్చారు. ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య, సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ వీరి బాగోగులను నిత్యం తెలుసుకుంటూ ఉన్నారు.