Begin typing your search above and press return to search.

లంక, పాక్, బంగ్లా, నేపాల్.. పొరుగంతా కల్లోలమే.. హసీనా లేకపోవడం లోటే

హసీనా లేకపోవడం మనకు లోటే బంగ్లా ప్రధాని హసీనా భారత్ కు అన్ని విధాలా అనుకూల ధోరణి కనబరిచారు.

By:  Tupaki Desk   |   5 Aug 2024 5:30 PM GMT
లంక, పాక్, బంగ్లా, నేపాల్.. పొరుగంతా కల్లోలమే.. హసీనా లేకపోవడం లోటే
X

భారత ఉప ఖండం.. ఈ పేరు వింటేనే ప్రత్యేకంగా అనిపిస్తోంది. భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ తదితర దేశాలతో ఈ ప్రాంతం చిన్న ఖండం తరహాలో కనిపిస్తుంది. దీంతోనే ఉప ఖండం అని పిలుస్తుంటారు. అయితే, వీటిలో భారత్ పెద్దన్న అనేది అందరికీ తెలిసిందే. కానీ, పాకిస్థాన్ తో ఎప్పుడూ సత్సంబంధాలు లేవు. మరోవైపు లంక ఒకప్పుడు మనకు చాలా దగ్గర. చైనా చెప్పుచేతల్లోకి వెళ్లి దూరమైంది. బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు తేడానే. అయితే.. షేక్ హసీనా పూర్తిస్థాయిలో బలం పుంజుకున్నాక మాత్రం పరిస్థితులు చాలా మెరుగయ్యాయి. ఆమె పూర్తిగా భారత అనుకూల వైఖరి కనబర్చారు. అదే ప్రతిపక్ష బేగం ఖలీదా జియా మాత్రం భారత్ అంటేనే వ్యతిరేకత కనబరిచేవారు.

లంక లకలకలక శ్రీలంక ద్వీప దేశం. దానికి దగ్గరగా ఉండేది భారత్. అన్నివిధాలుగానూ మనకు దగ్గరే. అయితే, అక్కడ రాజకీయ పరిస్థితులు రెండేళ్లుగా చాలా మారాయి. 2022 జూలైలో గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి దేశం విడిచి పారిపోయారు. ఆయన పాలనలో తీవ్ర అవినీతి, బంధు ప్రీతి, మితిమీరిన సంక్షేమం సంక్షోభానికి దారితీశాయి. ఇది చివరకు ప్రజాగ్రహంగా మారింది. ఆయన నివాసాన్ని ముట్టడించే వరకు వెళ్లింది. ఆ తర్వాత రాజకీయ మార్పులు జరిగాయి. లంక ఇప్పుడు కుదురుకుంటోంది.

పాక్ పని అయిపోయింది..

పుట్టుకతోనే భారత్ కు ఆగర్భ శత్రువు పాకిస్థాన్. అయితే, ఏడాదిన్నర కిందట వరకు సైన్యంతో కాస్త దగ్గరగా ఉన్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత సొంత నిర్ణయాలు మొదలుపెట్టారు. అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతు పలకడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఇమ్రాన్ ను ఇంటికి పంపింది సైన్యం. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీనే అధికారం చేపట్టింది. అయితే ,ఎన్నికలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ, ఇమ్రాన్ జైల్లో ఉండడంతో అవేమీ వాదనకు నిలవలేదు. మరోవైపు నేపాల్ లోఇటీవలే ప్రధాని అనూహ్యంగా దిగిపోయారు. కేపీ ఓలీ శర్మ ప్రధాని అయ్యారు. ఆయనకు ముందు ఉన్న ప్రధాని పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ విశ్వాసం కోల్పోయారు. దీంతో పదవికి రాజీనామా సమర్పించారు. పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో ఓడిపోయిన ఆయన, ఆ తర్వాత తన పదవిని కోల్పోయారు.

హసీనా లేకపోవడం మనకు లోటే బంగ్లా ప్రధాని హసీనా భారత్ కు అన్ని విధాలా అనుకూల ధోరణి కనబరిచారు. ముస్లిం దేశం అయిన బంగ్లాలో భారత వ్యతిరేక వైఖరి ఎక్కువే. అక్కడినుంచి ఉగ్రవాదం ఎగదోయకుండా చూడడంలో హసీనా విజయవంతం అయ్యారు. ఇప్పడు హసీనా బదులు ఆర్మీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చెప్పలేం. భారత్ తో సంబంధాలు ఇదివరకటిలా ఉండవనేది మాత్రం నిజం. మరి ఈ నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా.. భారత్ ఇదివరకటి మెతక దేశం మాత్రం కాదనే సంగతి అందరికీ తెలిసిందే. అవసరమైతే ఎంతకైనా తెగిస్తుందని గత పదేళ్లలో కొన్ని ఉదాహరణలు రుజువు చేశాయి.