Begin typing your search above and press return to search.

అమెరికాపై బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 12:30 PM GMT
అమెరికాపై బంగ్లా మాజీ ప్రధాని షేక్  హసీనా సంచలన వ్యాఖ్యలు!
X

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం హింసాకాండకు దారి తీయడంతో అక్కడ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయి, చివరకు ఆమె భారత్ లో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

అవును... బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ లో నేటి పరిస్థితికి, తమ ప్రభుత్వ పతనానికి కారణం అమెరికా అని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె బంగ్లాదేశ్ పౌరులకు పలు విషయాలు వెల్లడిస్తూ, విజ్ఞప్తులు చేశారు!

ఈ సందర్భంగా నాడు తాను ఇంకా దేశంలో ఉండి ఉంటే మరింత మంది ప్రాణాలు పోయేవని.. మరిన్ని ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యేవని ఆమె వెల్లడించారు. ప్రజలు ఎన్నుకున్నందువల్లే తాను నాయకురాలిని అయ్యయని.. తన బలం బంగ్లా ప్రజలే అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు హత్యలకు గురవ్వడంపైనా ఆమె స్పందించారు.

ఇందులో భాగంగా... తన పార్టీ అవామీ లీగ్ కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురవ్వగా, కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని.. ఈ సందర్భంగా వారి ఇళ్లను తగులబెట్టారని, వారి అస్తులు ధ్వంసం చేశారని.. ఇలాంటి ఘటనలతో ప్రసారమవుతున్న వార్తలు చూసి తన గుండే రోదిస్తుందని షేక్ హసీనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో భాగంగా... సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి గనుక ఇచ్చి ఉంటే.. తాను నిక్షేపంగా అధికారంలో ఉండగలిగేదాన్నని.. కానీ తాను అందుకు అనుమతించలేదని.. ఈ మేరకు ప్రజలు గ్రహించాలని అభ్యర్థిస్తున్నట్లు షేక్ హసీనా తెలిపారు. విద్యార్థుల మృతదేహాలపై అధికారంలోకి రావాలని కొంతమంది కోరుకున్నారని అన్నారు.

కాగా... బంగ్లాలో తాజా పరిస్థితులపై స్పందించిన షేక్ హసీనా తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్... దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ. ఆజ్యం పోసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన తల్లికి రక్షణ కల్పించినందుకుగానూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సాజిద్ వాజెద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించిన తర్వాత ఆమె తప్పకుండా తిరిగివస్తారని అన్నారు.