Begin typing your search above and press return to search.

సీన్ రివర్స్.. మళ్లీ బంగ్లాకు హసీనా.. వెళ్లేందుకు ముహూర్తం ఖరారు?

సహజంగా తిరుగుబాటు కారణంగా పదవులు కోల్పోయి.. దేశం విడిచి వెళ్లిపోయి ప్రవాసంలో ఉండే నాయకులు తిరిగి స్వదేశం చేరుకోవడం చాలా అరుదు

By:  Tupaki Desk   |   9 Aug 2024 10:30 AM GMT
సీన్ రివర్స్.. మళ్లీ బంగ్లాకు హసీనా.. వెళ్లేందుకు ముహూర్తం ఖరారు?
X

సహజంగా తిరుగుబాటు కారణంగా పదవులు కోల్పోయి.. దేశం విడిచి వెళ్లిపోయి ప్రవాసంలో ఉండే నాయకులు తిరిగి స్వదేశం చేరుకోవడం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా కొన్ని సంవత్సరాల తర్వాతనే. ఉదాహరణకు పాకిస్థాన్ ప్రధానమంత్రిగా పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ దుబాయ్, లండన్ లో పదేళ్లుపైగా కాలం గడిపారు. రెండేళ్ల కిందట శ్రీలంక నుంచి పరారైన గొటబాయ రాజపక్స ఇంకా తిరిగొచ్చారో లేదో తెలియదు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది ఉంటారు. కానీ, నాలుగు రోజుల కిందట తిరుగుబాటుతో బంగ్లాదేశ్ ను వీడిన మాజీ ప్రధాని షేక్ హసీనా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించనున్నారు.

10 నెలల్లోపే రెండోసారి ఎన్నికలు?

బంగ్లాదేశ్ లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందులో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) పాల్గొనలేదు. దీంతో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ 85 శాతం పైగా ఓట్లతో గెలుపొందింది. హసీనా వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు. కానీ.. రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో ఆరు నెలల్లోపే తీవ్ర ఆగ్రహం మూటగట్టుకున్నారు. ఆందోళనలు అల్లర్లుగా మారి విధ్వంసం చోటుచేసుకుంది. ఆఖరికి హసీనా కట్టుబట్టలతో దేశం విడిచారు. యూకే వెళ్లేందుకు ప్రయత్నించినా.. అనుమతి రాకపోవడంతో భారత్ లో ఆగిపోయారు. నాలుగు రోజులుగా చెల్లెలు రెహానాతో కలిసి ఢిల్లీ సమీపంలోని రహస్య ప్రదేశంలో ఉంటున్నారు. కాగా, హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

అమ్మ వెళ్తుంది..

విదేశాల్లో ఉంటున్న హసీనా కుమారుడు సజీబ్ వాజెజ్ జాయ్ తన తల్లి భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో గురువారం బంగ్లాలో ఆపధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇందులో పలువురు సలహాదారులూ ఉన్నారు. దేశంలో సైనిక పాలనకు అవకాశం లేనట్లేనని దీంతో స్పష్టమైంది. కాగా, యూనుస్ త్వరలోనే ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎన్నికల ప్రకటన రాగానే.. హసీనా స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. తన తల్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హసీనా కుమారుడు సజీబ్ చెప్పారు.

హసీనా పార్టీ లేకుండానే..?

బంగ్లాలో ఎన్నికలు నిర్వహించినా హసీనా పార్టీ అవామీ లీగ్ పాల్గొనే చాన్స్ ఉంటుందా? అనేది సందేహమే. బద్ధశత్రువైన బీఎన్పీని ఇన్నాళ్లు తొక్కిపెట్టారు హసీనా. ఇప్పుడు ఆ పార్టీకి అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట జరిగిన ఢాకా బీఎన్పీ ర్యాలీలో లక్షలాది జనం పాల్గొన్నారు. ఇక ఆపద్ధర్మ ప్రభుత్వంలో హసీనా పార్టీకి చోటు దక్కలేదు. ఇక సాధారణ ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు లేకున్నా.. మొన్నటి బీఎన్పీ ర్యాలీ పరోక్షంగా హసీనా పార్టీపై ఉన్న తీవ్ర ప్రజాగ్రహాన్ని చాటుతోంది. అంటే.. గెలవడం అసాధ్యం.