Begin typing your search above and press return to search.

అప్పట్లో దలైలామా.. ఇప్పుడు హసీనా.. భారత్ లో ఇంకా ఎన్నాళ్లో?

దలైలామాను అప్పగించనందుకే చైనా 1960ల్లో భారత్ పై యుద్ధానికి దిగింది.

By:  Tupaki Desk   |   13 Aug 2024 1:30 PM GMT
అప్పట్లో దలైలామా.. ఇప్పుడు హసీనా.. భారత్ లో ఇంకా ఎన్నాళ్లో?
X

అది 1959.. టిబెట్ పై చైనా పట్టు బిగుస్తున్నది.. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు అప్పటికి 24 ఏళ్లు.. దీంతో ఆయన చైనా బారి నుంచి తప్పించుకునేందుకు తన పరివారంతో 1959 మార్చి 30న భారత్ లోకి వచ్చేశారు. ఏప్రిల్‌ 18న అస్సాంలోని తేజ్‌పూర్‌ చేరుకున్నారు. ఇక అప్పటుంచి భారత్ ఆయన నివాసం అయిపోయింది. టిబెట్ వాతావరణానికి దగ్గరగ ఉండే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. భారత్ నుంచే ఇతర దేశాల పర్యటనలకు వెళ్తున్నారు. ఆయనను తమకు అప్పగించాలని చైనా గట్టిగా కోరుతోంది. కానీ, భారత్ తమ అతిథిని పంపేది లేదంటూ తేల్చిచెబుతోంది.

చైనాతో యుద్ధం అందుకే..

దలైలామాను అప్పగించనందుకే చైనా 1960ల్లో భారత్ పై యుద్ధానికి దిగింది. అప్పటివరకు హిందీ చీనీ భాయీభాయీ అంటూ ఉన్న వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. చైనాను ఎంతో నమ్మిన భారత తొలి ప్రధాని నెహ్రూ ఆ దేశ నాయకత్వం చేసిన మోసాన్ని తట్టుకోలేక మనో వ్యథకు గురై మరణించారని చెబుతారు. ఇక దలైలామా మాత్రం భారత గడ్డపైన 65 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఆయన శిష్య పరంపరకూ భారత దేశమే సొంత గడ్డ అయిపోయింది. బౌద్ధ మత గురువు అయిన దలైలామా ఉమ్మడి ఏపీలో జరిగిన బౌద్ధ సమ్మేళనానికీ హాజరయ్యారు. అతిథిని వెళ్లమనలేని భారత బలహీనతకు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ పై చైనా యుద్ధానికి దిగి అక్సాయ్ చిన్ లోని చాలా ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇప్పటికీ అక్కడినుంచి కదలడం లేదు.

మరి హసీనా సంగతో..?

భారత్ కు మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్ కు మొన్నటివరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆ దేశంలో తనపై పెల్లుబికిన నిరసనలతో ఉన్నపళంగా భారత్ కు వచ్చేశారు. ఇది జరిగింది గత సోమవారం. ఈ మంగళవారంతో 8 రోజులు పూర్తయింది. హసీనా చెల్లెలు రెహానా కూడా ఆమెతోనే ఉన్నారు. ఇక వీరు తొలుత బ్రిటన్ వెళ్లాలనుకున్నా.. తన నిబంధనలు ఒప్పుకోవని ఆ దేశం తేల్చిచెప్పింది. దీంతో భారత్ లోనే ఉంటున్నారు. మధ్యలో త్వరలోనే బంగ్లాకు వెళ్తానని హసీనా చెప్పినట్లు కథనాలు వచ్చాయి. కానీ, మాన్ స్టర్ వెళ్లిపోయింది అంటూ ఆమెను తీవ్ర పదజాలంతో దూషించారు బంగ్లా కొత్త ప్రభుత్వ సారథి యూనస్. అంటే.. హసీనా బంగ్లాలో కాలుపెడితే అరెస్టు చేసి జైలుపాలుజేయడం ఖాయం అనే పరిస్థితులున్నాయి.

ఇది రెండోసారి..

హసీనా భారత్ లో ప్రవాసం ఉండడం ఇది రెండోసారి. 1975లో తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులను సైన్యం హతమార్చిన సమయంలో హసీనా విదేశాల్లో ఉన్నారు. అప్పట్లో బంగ్లాకు వెళ్లలేక ఆరేళ్లు చెల్లెలు రెహానాతో కలిసి భారత్ లో ఉండిపోయారు. బంగ్లాకు తిరిగివెళ్లాక పదేళ్లు పోరాటం చేసి ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. 15 ఏళ్లకు పైగా ప్రధానిగా ఉన్నారు. మరి ఇప్పుడు మాత్రం భారత్ నుంచి కదిలే పరిస్థితి లేనట్లుంది.