Begin typing your search above and press return to search.

జగన్ ఓటమి బాబు కంటే ఆమెకే ఎక్కువ కావాలి...!?

కానీ తాను గెలవాలని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల పోరాడుతున్నారా అంటే దానికి జవాబు ఆమె చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   10 Feb 2024 3:42 AM GMT
జగన్ ఓటమి బాబు కంటే ఆమెకే ఎక్కువ కావాలి...!?
X

జగన్ ఓడిపోవాలి. ఇది రాజకీయంగా ఆయన ప్రత్యర్ధులు కోరుకుంటారు. అత్యంత సహజమైన కోరిక అది. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడితేనే రెండవ వారు గెలిచేది. పైగా ప్రత్యర్ధులు కూడా అదే ఆశిస్తారు. అలా చంద్రబాబు జగన్ ఓటమిని కోరుకోవడం తప్పు అనిపించదు. పైగా ఆయన టీడీపీని గెలిపించాలని పోరాడుతున్నారు. ఈసారి ఎన్నికలు ఆయనకు చావో రేవో లాంటివి.

గెలుపు అన్నది దైవాధీనం. ఒకవేళ ఓడితే ఏమిటి అన్నది కూడా బాబు లాంటి రాజకీయ కోవిదుడికి తెలియకుండా ఉండదు, దానికి కూడా సిద్ధపడే ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే బాబు ట్రూ పొలిటీషియన్. ఓటమిని ఆయన చాలా సార్లు చూశారు. ఆయనకు ప్లాన్ ఏ బీలు కూడా ఉంటాయి.

సరే బాబు ఈసారి గెలవాలని పోరాడుతున్నారు. కానీ తాను గెలవాలని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల పోరాడుతున్నారా అంటే దానికి జవాబు ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ స్థితి తెలిసిన వారు ఎవరైనా ఆ పార్టీ గెలుపుకు ఎంత దూరంలో ఉందో ఇట్టే చెప్పేస్తారు. ఏపీలో ఆఖరుకు బీజేపీకి కూడా ఎంతో కొంత పొత్తులతో గెలుపు పిలుపు వినిపిస్తుంది కానీ కాంగ్రెస్ కే కష్టం అని అంటారు అంతా.

మరి ఈ సంగతి తెలిసినా షర్మిల ఎందుకు జగన్ మీద వైసీపీ మీద పోరాటం చేస్తున్నారు అంటే ఇది కూడా తేలికైన జవాబే. ఆమె కూడా ఇపుడు ప్రత్యర్ధే. ఆమె కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. అందువల్ల అధికార పార్టీగా వైసీపీ ఓడిపోవాలనే కోరుకుంటారు. కానీ అది సాధ్యమా కాదా అంటే జవాబు జనాలు తీర్పు రూపంలో ఇస్తారు.

అయితే షర్మిల ఏపీలో మీటింగులు పెడుతున్నారు. ఆ సభలలో ఆమె జగన్ ని వైసీపీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. జగనన్న ఇంటికి వెళ్తారు అని అంటున్నారు. మొత్తం తన స్పీచ్ లో ఆమె కాంగ్రెస్ ఏపీకి ఏమి చేస్తుంది అని చెప్పడంలేదు. జగన్ పాలన మీద జగన్ మీదనే ఆమె విమర్శలు చేస్తున్నారు.

కోటలు నిర్మించుకుని జగన్ ఉన్నారని ఎన్నికల వేళ మాత్రమే జనాలలోకి వస్తున్నారు అని అంటున్నారు. ఆయనను ఇంటికి పంపించేందుకు జనాలు సిద్ధం అని అంటున్నారు. జగన్ ని తిట్టడానికి ఏపీలో విపక్ష పార్టీలు చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ గురించి చెప్పడానికి ఆమె మాత్రమే ఉన్నారు. అధికార పార్టీని విమర్శిస్తూ తమ పార్టీ గెలిస్తే ఏమి చేస్తామో కూడా చెప్పాలి. నిజానికి అదే ఎక్కువగా చెప్పాలి.

ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు విభజన తరువాత ఏపీకి ఏమీ చెప్పలేకపోయారు. అలాంటి అవకాశం వారికి రాలేదు. షర్మిల లాంటి ఎంతో కొంత ఆకర్షణ ఉన్న నేతలు కూడా లేకపోవడం లోటు. అందువల్ల ఈ సువర్ణ అవకాశం వాడుకుని ఆమె కాంగ్రెస్ ఎందుకు ఏపీని విడగొట్టింది, ఒకవేళ విడగొట్టినా ఏపీకి ఏ మేలు చేద్దామనుకుంది రేపటి రోజున అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది ఇవన్నీ చెప్పుకుంటే ఆ పార్టీ మీద ఎంతో కొంత ఉన్న వ్యతిరేకత తగ్గేదేమో.

కానీ అలా కాకుండా జగన్ ని తిట్టడం వల్ల ఏమి ఒనగూడుతుంది అన్నది ఒక విశ్లేషణ. మళ్లీ మొదటికే వెళ్ళి చెప్పుకుంటే జగన్ ఓటమి చెందితే కాంగ్రెస్ అధికారంలోకి రాదు కానీ షర్మిల జగన్ ఓడాలని అంటున్నారు. చాలా కసిగా కోరుకుంటున్నారు ఎందుకు అంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆమె రాజకీయ అస్తిత్వం ఇబ్బందులలో పడుతుంది కాబట్టి అంటున్నారు.

జగన్ ఓడితే తమ వల్లే అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న పదవి నిలబడుతుంది. రాజ్యసభ సీటు దక్కవచ్చు. కొన్నాళ్ల పాటు రాజకీయంగా లైం లైట్ లో ఉండవచ్చు. అదే జగన్ గెలిస్తే ఆమె రాజకీయమే ట్రబుల్స్ లో పడుతుందని విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు ఓడినా ఆయన పార్టీ ఉంటుంది. ఆయన విపక్ష నేతగా కేబినెట్ ర్యాంక్ తో ఉంటారు. 2019లో వచ్చిన 23 కంటే కూడా ఈసారి ఎక్కువ సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంటారు.

కానీ షర్మిలకు కాంగ్రెస్ మాత్రం ఏపీలో రాజకీయంగా ఇరకాటమే అంటున్నారు. అందుకే ఆమె జగన్ ఇంటికి పోవాలి అని అంటున్నారు. ఇది చంద్రబాబుకు మేలు చేసినా తనకూ కాంగ్రెస్ కి కూడా అందులో కొంత మేలు ఉంది కాబట్టి జగన్ మాజీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. మరి ఏపీ జనాలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.