'అజిత్ కు ఉదయం, సాయంత్రం అనుభవం ఉంది'... శిండే సెటైర్లు వైరల్!
ఈ సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజిత్ పవార్ పై శిండే సెటైర్లు వేశారు!
By: Tupaki Desk | 4 Dec 2024 1:28 PM GMTచాలా రోజులుగా అధికారికంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన విషయంలో బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం మహాయుతి కూటమిలో విభేదాలు సద్దుమణిగినట్లే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజిత్ పవార్ పై శిండే సెటైర్లు వేశారు!
అవును... మరికొన్ని గంటల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... ఏక్ నాథ్ శిండే అలిగారని.. ఇప్పటివరకూ నెలకొన్న సందిగ్ధతకు ఆయన వైఖరే కారణం అంటూ కథనాలొస్తున్న వేళ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ పేరును తానే సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో... మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు, మరెవరూ తక్కువా కాదని.. రాష్ట్రం కోసమే అంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. దీంతో... మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం కోసం మహాయుతి కూటమిలో తలెత్తిన విభేదాలు సద్దుమణిగినట్లేననే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోపక్క... మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే, బీజేపీ సీనియర్ నేత (కాబోయే ముఖ్యమంత్రి!) దేవేంద్ర ఫడ్నవీస్, ఏన్సీపీ అధినేత అజిత్ పవార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ను లక్ష్యంగా చేసుకుని శిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా.. "మీరు, అజిత్ పవార్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అని ఫడ్నవీస్ సమక్షంలోనే ఏక్ నాథ్ శిండేను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన శిండే... సాయంత్రం వరకూ వేచి చూడాలని తెలిపారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ స్పందిస్తూ... తానైతే ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.
ఇదే సమయంలో... శిండేకు సాయంత్రం వరకూ తెలిసి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. దీంతో... ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిసాయి. అనంతరం అజిత్ వ్యాఖ్యలపై స్పందించిన శిండే... "అజిత్ కు ఉదయం, సాయంత్రం పూట ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది" అంటూ చురకలంటించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఫడ్నవీస్... గురువారం సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని మోడీ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది బుధవారం సాయంత్రానికి కొలిక్కి వస్తుందని అన్నారు.