Begin typing your search above and press return to search.

షిప్ హైజాక్ జరిగిందిలా... హాలీవుడ్ యాక్షన్ సీన్ ని తలపించిన వీడియో!

ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనల ముందు సినిమా సన్నివేశా బలాదూర్ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా ఉంటుంటాయి.

By:  Tupaki Desk   |   21 Nov 2023 3:42 AM GMT
షిప్  హైజాక్  జరిగిందిలా... హాలీవుడ్  యాక్షన్  సీన్  ని తలపించిన వీడియో!
X

ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనల ముందు సినిమా సన్నివేశా బలాదూర్ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా ఉంటుంటాయి. తాజాగా హౌతీ రెబల్స్ విడుదల చేసిన ఒక వీడియో చూసిన ఎవరికైనా ఈ అభిప్రాయం కలిగే అవకాశం పుష్కలంగా ఉంది. హెలీకాప్టర్ నుంచి ఓడపైకి దిగడం.. అనంతరం తుపాకీలు చేతపట్టి ఆ ఓడలోకి వెళ్లడం వంటి దృశ్యాలు షాకింగ్ గా ఉన్నాయి. ఈ వీడియో చూసినవారు ఇది సినిమాలో సన్నివేశం కాదు అని తెలుసుకోవడం కాస్త కష్టమేనేమో!

అవును... తుర్కియే నుంచి భారత్‌ కు వస్తున్న "గెలాక్సీ లీడర్‌" కార్గో షిప్‌ హైజాక్‌ అయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ కు చెందిన ఈ షిప్ నడిసంద్రంలో హైజాక్ కి గురైంది. ఇలా హైజాక్ చేసిన హౌతీ రెబెల్స్‌... నౌకను తీర ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో తాజాగా ఈ హైజాక్ కి సంబంధించిన వీడియోను హౌతీ తిరుగుబాటుదారులు విడుదల చేశారు. ఈ వీడియో షాకింగ్ గా ఉంది!

తాజాగా హౌతీ తిరుగుబాటుదారులు విడుదల చేసిన ఈ వీడియోలో సదరు కార్గో షిప్‌ ను ఎలా హైజాక్‌ చేశారనే విషయం స్పష్టంగా ఉంది. ఇందులో భాగంగా హెలికాప్టర్‌ లో వచ్చిన సాయుధులు ఓడ డెక్‌ పై దిగారు. అనంతరం గాలిలో కాల్పులు జరుపుతూ, స్లోగన్స్‌ చేస్తూ అక్కడున్నవారిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓడను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ కార్గో షిప్ ని హైజాక్‌ చేశారు. అయితే హైజాక్ అయిన ఓడలో తమ దేశానికి చెందిన పౌరులు లేరని ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రకటించింది.

ఇదే సమయంలో... గెలాక్సీ లీడర్‌ కార్గో షిప్ అనేది ఇజ్రాయెల్‌ వ్యాపారికి చెందినప్పటికీ.. ప్రస్తుతం జపాన్‌ కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ కార్గో షిప్ లో బల్గేరియా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, ఉక్రెయిన్‌ కు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు.

కాగా... తుర్కియే నుంచి భారత్‌ కు రావాల్సిన కార్గో షిప్‌ హైజాక్‌ కు గురైన సంగతి తెలిసిందే. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించింది. ఇందులో భాగంగా... ఎర్ర సముద్రంలో యెమెన్‌ కు సమీపంలో హౌతీ రెబల్స్ కార్గో షిప్‌ ను హైజాక్ చేశారని తెలిపింది. ఇదే సమయంలో... ఈ నౌకలో ఇండియన్స్ ఎవరూలేరని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

మరోవైపు ఇజ్రాయెల్‌ కు చెందిన కార్గోషిప్‌ ను యెమెన్ తీరానికి తీసుకెళ్లామని హౌతీ పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పోర్ట్ నగరమైన సలీఫ్‌ కు తీసుకెళ్లినట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆ హైజాక్ ఎలా జరిగింది అనే ఘటనకు సంబంధించి ఒక వీడియో తాజాగా విడుదల చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది!