పోసాని కృష్ణమురళి పరిస్థితిపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్య్యాఖ్యలు చేశారని..
By: Tupaki Desk | 18 March 2025 10:49 AM ISTఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్య్యాఖ్యలు చేశారని.. సినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ లో పోసాని కృష్ణమురళిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే!
ఈ క్రమంలో ఆయనపై పలు ఫిర్యాదుల ఆధారంగా సుమారు 17 కేసులు నమోదయ్యాయి! వీటిలో ఒక కేసులో బెయిల్ వచ్చినా.. మరో కేసులో అరెస్ట్ కావడం, రిమాండ్ కు వెళ్లడం జరుగుతోంది! ఈ క్రమంలో ఈ నెల 26వరకూ ఆయన జైల్లోనే ఉండనున్నారని అంటున్నారు. మరోపక్క పోసానిని ఈ రోజు విచారించేందుకు కోర్టు సీఐడీకి అనుమతిచ్చింది.
దీంతో... మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోసానిని సీఐడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది! అదే రోజు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది. ఈ సమయంలో పోసాని తాజా పరిస్థితిపై నటుడు శివాజీ స్పందించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీకి... పోసాని అయినా వేరే ఎవరైనా ఇండస్ట్రీ జనాలకు రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా.. వాటిని ఎక్స్ ప్రెస్ చేయకూడదా? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన శివాజీ... నేను ఒక్క సందర్భంలో కూడా అవసరం లేని మాటలు మాట్లాడలేదని.. ఎవరి వ్యక్తిగత విషయాలపైనా వ్యాఖ్యానించలేదని అన్నారు.
తాను ప్రజల అవసరాలు, సమస్యల గురించి మాట్లాడానే తప్ప జగన్ వ్యక్తిగత జీవితం గురించి తాను ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే... పోసానిని ఇంకా ఇంకా తిప్పాలని అధికారంలో ఉన్నవారి పక్కనున్నవారు చెబుతుంటారని.. కానీ, ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు.
పోసానికి పాఠం నేర్పుతున్నారు సరే కానీ.. ఐదేళ్లూ నేర్పడం కరెక్ట్ కాదని శివాజీ అభిప్రాయపడ్డారు. కొన్ని వందల మందిని చంపేసినవారికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారని.. తన వరకూ అయితే పోసాని వయసుకు ఇప్పటికే చేసింది చాలని తన అభిప్రాయమని శివాజీ అన్నారు. పోసాని రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వాలని సూచించారు!
దీంతో... పోసాని కృష్ణమురళి విషయంలో నటుడు శివాజీ అభిప్రాయాలను ఎవరు ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనేది వేచి చూడాలి! కాగా... పోసాని కృష్ణమురళికి కోర్టు ఈ నెల 26 వరకూ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.