భార్య తరఫు ప్రచారం.. ఆ స్టార్ హీరో సినిమాల్ని బ్యాన్ చేయాలా?
అర్థం పర్థం లేని వాదనను తెర మీదకు తీసుకొచ్చిన బీజేపీ నేతల డిమాండ్ విమర్శలకు గురవుతుంది.
By: Tupaki Desk | 23 March 2024 4:57 AM GMTఅర్థం పర్థం లేని వాదనను తెర మీదకు తీసుకొచ్చిన బీజేపీ నేతల డిమాండ్ విమర్శలకు గురవుతుంది. అసలు ఆలోచించే ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎంత ఎన్నికలైతే మాత్రం.. కించిత్ వ్యతిరేకతను ఇష్టపడని రీతిలో వ్యవహరిస్తున్న బీజేపీ నేతల మాటలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కన్నడ సూపర్ స్టార్ గా శివకుమార్ గురించి తెలిసిందే.
తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆయన సతీమణి సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి వేళ ఆయనపై బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకుంటే.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయన సినిమాలు.. ప్రకటనలు.. బిల్ బోర్డుల ప్రదర్శనల్ని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది బీజేపీ.
శివకుమార్ సతీమణి షిమోగా లోక్ సభా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఆర్ రఘు ఎన్నికల అధికారులకు ఒక లేఖ రాశారు. అందులో శివకుమార్ సినిమాలు ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపుతాయని.. అందుకే ఆయన సినిమాల్ని ఎన్నికలు జరిగే వరకు బ్యాన్ చేయాలని కోరటం సంచలనంగా మారింది.
ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే శివకుమార్ హక్కును తాము గౌరవిస్తున్నామంటూనే.. ఎన్నికల వేళ ప్రజలపై ఆయన సినిమాల ప్రభావం ఉండకూదని.. దాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందన్న వాదనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా తాను అభిమానించే రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చు.
ఒకవేళ.. బీజేపీ నేతల మాటల్నే తీసుకుంటే.. ఆ పార్టీకి మద్దతు ఇస్తూ.. ప్రచారం చేసే ఇతర రంగాలకు చెందిన వారి పనుల మీదా బ్యాన్ విధిస్తే? ఈ వాదనలో ఎలాంటి పస కనిపించదు కదా? తాజాగా శివకుమార్ విషయంలోనూ అలాంటిదే కనిపిస్తుంది. ఈ లెక్కన రాజకీయాల్లో ఉన్న వారు.. రాజకీయ పార్టీల తరఫు ప్రచారం చేసే వారి వ్యాపారాలు.. కార్యక్రమాల మీద ఆంక్షలు విధించమని అడిగితే ఎంత ఎటకారంగా ఉంటుందో.. అంతే ఎటకారంగా బీజేపీ నేత డిమాండ్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.