పందిట్లో కన్యాదానం.. ఆ వెంటనే గుండెపోటుతో సెలవు
హృదయవిదారక ఘటన గురించి తెలిస్తే.. దేవుడా ఇలాంటి కష్టం ఇంకెవరికి కలగనీయొద్దు అనుకోకుండా ఉండలేరు.
By: Tupaki Desk | 22 Feb 2025 10:30 AM GMTవిన్నంతనే షాక్ కు గురయ్యే పరిణామాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడిన ప్రాంగణం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవటంతో పాటు.. ఏం చేయాలో తోచని పరిస్థితి. హృదయవిదారక ఘటన గురించి తెలిస్తే.. దేవుడా ఇలాంటి కష్టం ఇంకెవరికి కలగనీయొద్దు అనుకోకుండా ఉండలేరు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన 56 ఏళ్ల కుడిక్యాల బాల్ చంద్రం తన వృత్తిలో భాగంగా కామారెడ్డిలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య.. ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె కనకమహాలక్ష్మికి బెంగళూరుకు చెందిన రాఘవేంద్రతో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం జంగంపల్లి శివారులోని ఒక కల్యాణమండపాన్ని బుక్ చేశారు ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు.
బంధుమిత్రులతో కళకళలాడుతున్న పెళ్లిపందిట్లో కూతుర్ని కన్యాదానం చేశారు బాల్ చంద్రం. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పెళ్లి పందిట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళనకు గురైన వారు.. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో.. అప్పటివరకు పెళ్లి సందడితో కళకళలాడుతున్న వేదిక.. ఒక్కసారిగా విషాదంతో నిండిపోయింది. ఊహించని పరిణామం అక్కడి వారందరిని షాక్ కు గురి చేసింది.